- ఏఆర్‌టీ, సరోగసీ చట్టాలను కట్టుదిట్టం చేయండి
- ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్లను జిల్లాలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లు రూల్స్ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని, చట్టాన్ని ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా ఏఆర్‌టీ, సరోగసీ చట్టాల అమలును క్షేత్రస్థాయిలో కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు.
సోమవారం సెక్రటేరియెట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ, ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్ల పనితీరు, పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఫెర్టిలిటీ సేవల పేరుతో పేషెంట్లపై అనవసర ఆర్థిక భారం మోపకుండా, పారదర్శకతతో వైద్యం అందేలా చూడాలని సూచించారు. హాస్పిటల్స్‌లో వినియోగిస్తున్న మందులు, ఇంజక్షన్లు, వాటి తయారీ సంస్థలు, ఎంఆర్‌పీ ధరలను కూడా తనిఖీల్లో పరిశీలించాలని ఆదేశించారు.
ఐవీఎఫ్, స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టండి...
రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్టర్ అయి ఉన్న 477 ఏఆర్‌టీ, సరోగసీ సెంటర్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి దామోదర్ స్పష్టం చేశారు. ఇటీవల 379 సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించగా, 50 సెంటర్లలో వివిధ రకాల ఉల్లంఘనలు గుర్తించినట్లు హెల్త్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మంత్రికి తెలిపారు. తీవ్రతను బట్టి 2 సెంటర్ల రిజిస్ట్రేషన్లను శాశ్వతంగా రద్దు చేయగా, 9 సెంటర్ల పర్మిషన్లను టెపరరీగా రద్దు చేసినట్లు వివరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే సెంటర్లపై నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు రాష్ట్రవ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లు, హాస్పిటళ్లలో 2,600 తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఇందులో 52 సెంటర్లలో లోపాలు గుర్తించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
జిల్లాల్లో ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్లు..
గాంధీ హాస్పిటల్, పేట్లబురుజు సెంటర్లలో ఇప్పటి వరకు మొత్తం 39,802 మంది పేషెంట్లకు ఫెర్టిలిటీ చికిత్సలు అందించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇందులో 20,185 ఫాలిక్యులర్ స్టడీలు, 521 ఐయూఐ ప్రక్రియలు, 545 ఐవీఎఫ్ కేసులు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఇదే స్ఫూర్తితో దశలవారీగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, ఐవీఎఫ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుమిత్ర పాల్గొన్నారు.
