- చర్యలకు ఉపక్రమించిన సివిల్ సప్లయ్స్ కమిషనర్
- రిటైర్డ్ డీఎస్పీ సహా ముగ్గురిపై వేటు
- మరో ముగ్గురి డిప్యుటేషన్ రద్దు
హైదరాబాద్, వెలుగు: అక్రమాలను అరికట్టి ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెంచాల్సిన విజిలెన్స్ విభాగంలోనే అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రైస్ మిల్లుల తనిఖీలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాల్సిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్-1లోని కొందరు అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అంతర్గత విచారణలో అక్రమాలు నిజమేనని తేలడంతో టీమ్-1ను రద్దు చేసి, ఆరుగురిపై చర్యలు తీసుకుంది. మిల్లర్లను తనిఖీల పేరుతో ఒత్తిడికి గురిచేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతోపాటు, అంతర్రాష్ట్ర సరిహద్దుల మీదుగా పీడీఎస్ అక్రమ రవాణా చేసే ముఠాల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్ల నుంచి సుమారు రూ.40 లక్షలు, పీడీఎస్ రవాణాదారుల నుంచి దాదాపు రూ.80 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.
తనిఖీల పేరుతో భయపెట్టి..
రైస్ మిల్లులను తనిఖీ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణలో అక్రమాలు, నిల్వల్లో తేడాలు, రికార్డుల్లో లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విజిలెన్స్ బృందాలది. కానీ నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని విజిలెన్స్ఎన్ఫోర్స్మెంట్ టీమ్1కు చెందిన కొందరు అధికారులు ఈ తనిఖీలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తనిఖీల సందర్భంగా లోపాలు బయటపడగానే కేసులు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామంటూ భయపెట్టి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఈ వసూళ్లపై మిల్లర్ల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు విజిలెన్స్ బృందంపై నిఘా పెట్టారు. మిల్లుల వారీగా తనిఖీల రికార్డులు, మిల్లర్లపై తీసుకున్న చర్యలపై అంతర్గతంగా విచారణ చేపట్టగా, అక్రమాలు నిజమేనని బయటపడింది. దీంతోపాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల మీదుగా పీడీఎస్ తరలించే ముఠాల నుంచి దాదాపు రూ.80 లక్షలు వసూలు చేసినట్లు తేలింది.
ఆరుగురిపై చర్యలు..
ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్-1లో పనిచేస్తున్న ఆరుగురిపై సివిల్ సప్లయ్స్ శాఖ చర్యలు చేపట్టింది. ముగ్గురు రెగ్యులర్ సిబ్బందిని వారి మాతృశాఖలకు పంపారు. వీరిలో ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నారు. మరో ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగించారు. వీరిలో రిటైర్డ్ తహసీల్దార్, రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్, రిటైర్డ్ డీఎస్పీ అంజయ్య ఉన్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
డీటీలకు మెమోలు..
ఇంత జరుగుతున్నా పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా సివిల్ సప్లయ్స్ శాఖ దృష్టి సారించింది. యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లోని డిప్యూటీ తహసీల్దార్లకు మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు, అధికారుల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదన్న అంశంపై వివరణ కోరినట్లు సమాచారం.
‘ఇంటి దొంగల’పై నజర్..
నల్గొండ, ఖమ్మం జిల్లా విజిలెన్స్అధికారుల వసూళ్ల బాగోతం వెలుగులోకి రావడంతో సివిల్సప్లైశాఖ ఉన్నతాధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇది ఆ రెండు జిల్లాలకే పరిమిమైందా? మిగిలిన జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయా? అనే కోణంలో సివిల్సప్లై శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లావారీగా క్షేత్రస్థాయిలో మిల్లుల తనిఖీలు, ఫిజికల్ వెరిఫికేషన్లు, రికార్డుల పరిశీలనను ఉన్నతాధికారులు వెరిఫై చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు ఎక్కడైనా మిల్లర్లకు అనుకూలంగా ఫిజికల్ వెరిఫికేషన్ నివేదికలు ఇచ్చారా?.. తనిఖీల్లో గుర్తించిన లోపాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారా?.. అక్రమ రవాణాదారులతో కుమ్మక్కయ్యారా?.. అనే కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. జిల్లా అధికారులతో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పనితీరుపైనా దృష్టి సారించినట్లు చెప్తున్నారు. మొత్తం మీద డీఫాల్ట్ మిల్లర్లు, రేషన్ బియ్యం అక్రమార్కుల అంతుచూసేందుకు విజిలెన్స్ టీమ్లను రంగంలోకి దింపితే, ఆయా బృందాల్లోని అధికారుల అవినీతి సివిల్సప్లైశాఖకు కొత్త తలనొప్పిలా మారింది.
