ప్రజాధనం వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి..అంచనాల కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ విజ్ఞప్తి

ప్రజాధనం వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి..అంచనాల కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ విజ్ఞప్తి
  • కమిటీలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలివ్వాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలోని ప్రతి శాఖ ప్రజా ధనాన్ని ఏ మేరకు ఖర్చు చేస్తోంది? ఆ ఖర్చు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటోంది? అనే అంశాలపై అంచనాల కమిటీ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని సమీక్షించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సోమవారం శాసనసభ ఆవరణలోని స్పీకర్ కార్యాలయంలో అసెంబ్లీలోని పలు కమిటీల సమావేశాలు జరిగాయి. అంచనాల కమిటీతో పాటు సౌకర్యాల కమిటీ, గ్రంథాలయ కమిటీ, వన్యప్రాణులు-పర్యావరణ కమిటీ సమావేశాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అతిథులుగా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం లేని అంశాలను కమిటీలు లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు అందించాలని కోరారు.