గిరిజనుల హక్కులు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

గిరిజనుల హక్కులు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు: వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల హక్కులు, జీవనోపాధికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని ఆదిలాబాద్​జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. హైదరాబాద్​లోని అసెంబ్లీ హాల్​లో సోమవారం జరిగిన వన్యప్రాణులు, పర్యావరణ కమిటీ ప్రాథమిక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత ఎంత ముఖ్యమో.. తరతరాలుగా అడవులను నమ్ముకొని బతుకుతున్న గిరిజనులు, స్థానిక ప్రజల సంక్షేమం కూడా అంతే ముఖ్యమన్నారు. 

పర్యావరణ పరిరక్షణ పేరుతో అటవీ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, వారి సమస్యలను పరిష్కరిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం అమలు, వన్యప్రాణుల సంచారం వల్ల పంటలు, ఆస్తులకు జరుగుతున్న నష్టం, గూడాలు,- తండాలకు రోడ్లు, మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారం లభించేలా కృషి చేస్తానని వెల్లడించారు.