- ప్రారంభించిన సీఎం యోగి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
లక్నో: యూపీలోని నేపాల్‌గంజ్ రోడ్–నన్‌పరా–బహ్రాయిచ్ మధ్య కొత్తగా నిర్మించిన బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం ప్రారంభించారు. సుమారు రూ.730 కోట్ల వ్యయంతో 56.15 కిలోమీటర్ల పొడవైన ఈ సెక్షన్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చి విద్యుదీకరించారు. డీజిల్ ఇంజిన్లకు బదులుగా పూర్తిగా ఎలక్ట్రిక్ రైళ్లు నడిచేలా రూట్‌ను పూర్తిగా ఆధునీకరించారు.
ప్రస్తుతం ఉన్న నాలుగు రైలు సర్వీసులను కూడా నేపాల్‌గంజ్ రోడ్ వరకు పొడిగించారు. ఈ కార్యక్రమంలోనే సీఎం యోగి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ..నేపాల్‌లోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, నేపాల్ దేశాల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు.
ఇది ప్రజల దశాబ్దాల కల
సీఎం యోగి మట్లాడుతూ.‘‘నేపాల్ వరదలు భారత్‌తో సహా అనేక దేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. నేపాల్‌గంజ్ రోడ్, నన్‌పరా, -బహ్రాయిచ్ రైలు మార్గం, నాలుగు కొత్త రైలు సర్వీసుల ప్రారంభంతో ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఈ కొత్త రైలు కనెక్టివిటీ బహ్రాయిచ్, రూపాయిదిహా, నేపాల్‌గంజ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది’’
అని పేర్కొన్నారు.
