- నల్లధనంలో ఒక్క శాతం కూడా రికవరీ కావట్లేదు
- కేంబ్రిడ్జ్ వర్సిటీ సదస్సులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు
- దేశాలన్నీ ఐక్యతతో ఆర్థిక మోసాలను అడ్డుకోవాలని పిలుపు
- కేంబ్రిడ్జ్ వర్సిటీ సదస్సులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఏడాదిలో పోగవుతున్న అక్రమ సంపాదనతో భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ ఓ మోస్తరు లాప్‌టాప్‌ను కొనివ్వొచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అంత భారీ మొత్తంలో నల్లధనం చెలామణి అవుతున్నప్పటికీ నూటిలో కనీసం ఒక భాగం కూడా రికవరీ కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్ట్ కుంభకోణాల వంటి కొత్త తరహా నేరాల పరిష్కారంపై భారతీయ న్యాయవ్యవస్థే క్రియాశీలకంగా ముందుకుసాగుతున్నదని పేర్కొన్నారు.
సోమవారం ఆయన లండన్‌లోని కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఆర్థిక నేరాలపై జరిగిన 43వ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ‘మొత్తం ప్రపంచ దేశాల అక్రమ సంపాదన.. భూమి పైనున్న సుమారు 800 కోట్ల మందికి ఒక్కో లాప్‌టాప్ చొప్పున కొనడానికి సరిపోతుంది. ఇంకా కొంత డబ్బు మిగిలిపోతుంది కూడా. ఆ సంపదలో ప్రతి వంద భాగాలకు కేవలం ఒక్క భాగం మాత్రమే వెనక్కి వస్తున్నది.
భారత్లో ముఖ్యంగా పీఎంఎల్‌ఏ 2002 తో పాటు పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల చట్టం2018 వంటివి అమలులో ఉన్నాయి. అయితే ఇవన్నీ కరెక్టేనని, ఏ తప్పులు లేవని నేను చెప్పట్లేదు’ అని సీజేఐ వివరించారు. దేశాలన్నీ ఐక్యతో ఆర్థిక మోసాలను అడ్డుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తప్పులు సరిదిద్దడానికే జోక్యం
పీఎంఎల్‌ఏ ప్రక్రియను దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయని సీజేఐ తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవడానికి, వ్యవస్థలో తప్పులను సరిదిద్దడానికే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటోందని చెప్పారు.
