యుద్ధం మళ్లీ స్టార్ట్.. అమెరికా, ఇరాన్ దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా

యుద్ధం మళ్లీ స్టార్ట్.. అమెరికా, ఇరాన్ దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా

టెహ్రాన్: దాదాపు నెల రోజులుగా స్తబ్ధుగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ మళ్లీ భగ్గుమంది. ఆదివారం (ఆగస్ట్ 30) హోర్ముజ్ జలసంధిలోని లారాక్ ద్వీపంలో ఉన్న ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా వైమానిక దాడులు చేసింది. నెల రోజుల తర్వాత ఇరాన్‌పై అమెరికా జరిపిన తొలి సైనిక దాడి ఇది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇరుదేశాల పోటాపోటీ దాడులతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. 

అమెరికా ఈ దాడులను ధృవీకరించింది. హార్మూజ్ జలసంధి సమీపంలోని లారాక్ ద్వీపంలోని రెండు ఇరాన్ లాంచర్లపై అమెరికా దళాలు దాడి చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు హోర్ముజ్ జలసంధిలోకి సముద్ర మైన్‌లతో కూడిన రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్లు గుర్తించి ఈ దాడులు చేశామని తెలిపింది. 

హార్మూజ్ జలమార్గంలోకి ఇరాన్ మరిన్ని సముద్ర మైన్‌లను అమర్చకుండా నిరోధించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని స్పష్టం చేసింది. ఇప్పటికే జలసంధిలోని అంతర్జాతీయ నౌకా మార్గాల్లో ఇరాన్ అమర్చిన మైన్‌లను తొలగించడం పూర్తి చేసినట్లు తెలిపింది. అమెరికా దళాలు ఈ ప్రాంతాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని.. ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా వాణిజ్యం స్వేచ్ఛగా సాగేందుకు రక్షణ కల్పించడానికి అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొంది. 
 
అమెరికా దాడులకు ఇరాన్ కౌంటర్ అటాక్

లారాక్ ద్వీపంలోని మిస్సైల్ లాంచర్లపై అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా దాడులకు కౌంటర్‎గా జోర్డాన్‌లోని యూఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. జోర్డాన్‌లోని కింగ్ హుస్సేన్, అల్-అజ్రాక్ వైమానిక స్థావరాల వద్ద ఉన్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, నిర్వహణ సౌకర్యాలపై ఐఆర్జీసీ బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసింది. 

అలాగే, యుఏఈలోని అల్ మిన్హాద్ బేస్‌లో అమెరికా హెలికాప్టర్లు, సిబ్బంది మోహరించి ఉన్న ప్రాంతాలపై డ్రోన్‌‎లతో దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల వల్ల అమెరికాకు భారీ నష్టం జరిగిందని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిలోని లారాక్ ద్వీపంపై అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు కూడా పేర్కొంది.