రియాద్, ఇతర ప్రాంతాలపైకి వచ్చిన క్షిపణులను కూల్చేశామన్న సౌదీ
ప్రతీకార దాడులు చేశామన్న రెబెల్స్
రియాద్: సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీ ప్రధాన కార్యాలయంపై హౌతీ తిరుగుబాటుదారులు మంగళవారం రాత్రి మిసైల్ దాడి చేశారు. ఈ దాడిలో అరామ్కో ప్రధాన కార్యాలయంలోని కంపెనీ సీఈవో ఆఫీసుతో సహా మూడు అంతస్తులు ధ్వంసమయ్యాయి. అయితే, ఈ దాడిలో ఆస్తి నష్టం మినహా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ అధికారులు వెల్లడించారు. అరామ్కో ప్రధాన కార్యాలయం ఉన్న ధహ్రాన్ నగరంపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు హౌతీలు అంతకుముందే ప్రకటించారు.
యెమెన్ రాజధాని సనా తదితర ప్రాంతాలపై సౌదీ దాడులకు ప్రతీకారంగానే ఈ అటాక్స్ చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం సౌదీ రాజధాని రియాద్లో కూడా పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు కూడా ఇరాన్- మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులే చేసినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ధహ్రాన్పైకి దూసుకు వస్తున్న ఓ బాలిస్టిక్ క్షిపణిని, రియాద్పైకి వస్తున్న క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను.. అలాగే ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, మిలిటరీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్లు ఉన్న అల్-ఖర్జ్ వైపు దూసుకొచ్చిన క్రూయిజ్ క్షిపణిని కూడా తాము కూల్చివేసినట్టు సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి వెల్లడించింది.
మరోవైపు, మంగళవారం యెమెన్లో జరిగిన దాడులలో ఇద్దరు మృతి చెందినట్లు తిరుగుబాటుదారుల నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, సౌదీ విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలు, చమురు స్థావరాలను హౌతీలు నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారు. రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత వారంలో జరిగిన వరుస దాడులలో18 మంది మృతి చెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు.
