- ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయించి స్మార్ట్ ఫోన్‌లోకి ఎంటర్
- ఏటీఎం, యూపీఐ పిన్ నంబర్లు సహా డేటా అంతా చోరీ
- ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్‌లోడ్స్‌లో జాగ్రత్త వహించాలి: ఐ4 సీ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఆండ్రాయిడ్ ఫోన్లను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పోర్నోగ్రఫీ, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల ముసుగులో స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన పోర్న్ కంటెంట్‌ను ప్రచారం చేస్తూ లింకులు పంపిస్తున్నారు. ఆ లింక్‌లకు మాల్‌వేర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కిట్ (ఏపీకే) ఫైళ్లను అటాచ్ చేస్తున్నారు. నైట్ ప్లే, రీలూప్, కిస్, విమో, రివో, నెక్సో, విక్సా వంటి యాప్‌ల ద్వారా యూజర్లను మోసగిస్తున్నారు. ఆ లింక్‌లపై క్లిక్ చేయగానే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి, ఆండ్రాయిడ్ ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. యాప్ అప్‌డేట్ పేరిట మరో ప్యాకేజీని డౌన్‌లోడ్ చేయించి, ఫోన్‌లోని ఇంటర్నెట్‌పై దాడి చేస్తున్నారు. ఒకసారి ఇలా ఇన్‌స్టాల్ అయిన మాల్‌వేర్ యాప్‌లను తొలగించడం సాధ్యం కాదని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ మేరకు నిర్వహించిన పరిశోధనల అనంతరం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)లోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ ఇటీవల పలు హెచ్చరికలు జారీ చేసింది.
హ్యాకర్ల చేతికి ఫోన్ డేటా
సైబర్ నేరగాళ్లు..లిప్‌స్టిక్ -కిస్ ఐకాన్, కేవైఎస్‌ఎస్ పేరిట ఉన్న ఏపీకే ఫైల్స్‌తో యూజర్లను ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ వైపు మళ్లించి యాక్సెసిబిలిటీ పర్మిషన్లు తీసుకుంటున్నట్లు పరిశోధనలో తేలింది. అధునాతన ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ రిమోట్-యాక్సెస్ ట్రోజన్ ద్వారా ఫోన్‌లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ డేటా, బ్యాంక్ అకౌంట్లు, నెట్‌బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ పిన్ నంబర్లతో సహా పూర్తి డేటాను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. బ్యాటరీ స్థితి, మెమొరీ, స్క్రీన్ సమాచారం అంతా కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. కాబట్టి ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐ4సీ అధికారులు సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఆర్థిక మోసాలకు గురైనా లేదా అనుమానాస్పద యాప్‌లను గుర్తించినా వెంటనే 1930 సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.
