- హైదరాబాద్‌కు రెండు అంతర్జాతీయ వర్సిటీలు..
- నగరంలో ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’, ‘నార్త్ ఈస్టర్న్’ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు
- నవంబర్ నుంచే ‘హార్వర్డ్’ ఎగ్జిక్యూటివ్ కోర్సులు
- సీఎంకు నివేదిక సమర్పించిన ఉన్నత స్థాయి కమిటీ
- విద్య, నైపుణ్యాలు అందేలా ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’: సీఎం రేవంత్
- మన విద్యార్థులకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విదేశీ ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చాయి. సీఎంరేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో జరిపిన పర్యటనల్లో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహనా పత్రాలు , లెటర్ ఆఫ్ ఇంటెంట్ల సమగ్ర నివేదికను సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ అందజేసింది.
ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్‌ను, ఇప్పుడు అంతర్జాతీయ నాణ్యమైన ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రంగా మలచడమే లక్ష్యమని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్‌లోనే తమ మొట్టమొదటి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో నెలకొల్పేందుకు అంగీకరించాయి. దీనికితోడు ప్రపంచ ప్రసిద్ధ ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను రాబోయే నవంబర్ నుంచి ప్రత్యక్షంగా ప్రారంభించనున్నది.
గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌గా రాష్ట్ర యువత.. బ్లూప్రింట్ రెడీ
ఈ ప్రతిష్టాత్మక పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ , స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ , ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , ఇంపీరియల్ కాలేజ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్, వర్జీనియా టెక్‌లాంటి ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల అధిపతులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. ముఖ్యంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుపై విస్తృత అవగాహన కుదరగా, ఆయా విద్యాసంస్థల నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి వసతుల పరిశీలనకు త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నాయి.
ప్రాథమిక నర్సరీ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు, అలాగే ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలల ఆధునీకరణ ద్వారా రాష్ట్ర యువతను గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల అనుసంధానంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను వారి ముంగిట్లోనే అందించేలా ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి.
నా నేతృత్వంలో హైపవర్ టాస్క్‌ఫోర్స్ : సీఎం రేవంత్
కమిటీ నివేదికను స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను చేర్చే లక్ష్యానికి ఈ అంతర్జాతీయ వర్సిటీల భాగస్వామ్యం బలమైన పునాది వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మన విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏర్పాటయ్యే ప్రత్యేక ‘హైపవర్ టాస్క్‌ఫోర్స్’కు తానే స్వయంగా నేతృత్వం వహిస్తానని ప్రకటించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మారితే మరిన్ని ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీ ), గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) పెట్టుబడులతో తరలివస్తాయని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రెట్టింపవుతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేస్తున్నామని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ శాంతకుమారి, సీఎం సలహాదారు కె. రామకృష్ణరావు స్పష్టం చేశారు. రాబోయే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’లో అంతర్జాతీయ విద్య, క్రీడా రంగాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు
