ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, బకాయిలు విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవో నంబర్ 09ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలోని 325 ప్రభుత్వ బీసీ కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని కోరుతూ.. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు.
విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం ఉన్నత ధర్మాసనానికి అప్పీల్ చేయాలని కోరారు.
