ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో ఉద్యోగుల భవిష్యత్ ఆదాయంపై అనిశ్చితి నెలకొంది. అందువల్ల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమే సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం. తెలంగాణలో 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 653, 654, 655 ప్రకారం ఈ విధానం అమలు చేశారు. దీంతో ఆ తేదీ నుంచి నియమితులైన ఉద్యోగులకు గతంలో ఉన్న పాత పెన్షన్ విధానం స్థానంలో కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది.
పెన్షన్ అంటే సామాజిక భద్రత
పెన్షన్ అనేది ప్రభుత్వం ఉద్యోగికి చేసే దానం కాదు. దీర్ఘకాలం ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం కల్పించే సామాజిక భద్రత. ఉద్యోగ జీవితంలో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ సేవకు తన సమయం, శ్రమ, నైపుణ్యాలను అందించిన ఉద్యోగికి వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం అవసరం. పెన్షన్ హక్కుపై సుప్రీంకోర్టు డి.ఎస్. నకారా వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో 1982లో ఇచ్చిన తీర్పు భారత పెన్షన్ చరిత్రలో కీలకమైనది. ‘పెన్షన్ ప్రభుత్వ దయాదాక్షిణ్యంతో ఇచ్చే బహుమతి కాదు, దీర్ఘకాలం సేవ చేసిన ఉద్యోగికి నిబంధనల ప్రకారం లభించే హక్కు’ అని న్యాయస్థానం పేర్కొన్న విషయం గమనార్హం.
పాత పెన్షన్ విధానం.. కొత్త విధానం మధ్య తేడా
పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ అనంతరం నిబంధనల ప్రకారం నిర్దిష్ట పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్‌పై కరువు భత్యం, కాలానుగుణ వేతన సవరణల ప్రభావం ఉండటంతోపాటు కుటుంబ పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే తీసుకునే అవకాశం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త పెన్షన్ విధానంలో మాత్రం ఉద్యోగి, ప్రభుత్వం చెల్లించే చందాలు పెట్టుబడులుగా కొనసాగుతాయి. వాటి ద్వారా ఏర్పడిన మొత్తం, పెట్టుబడులపై వచ్చిన ఆదాయం, పదవీ విరమణ సమయంలో వర్తించే నిబంధనల ఆధారంగా ఉద్యోగికి లభించే ప్రయోజనాలు నిర్ణయించడం జరుగుతుంది.
పాత పెన్షన్ విధానమే దీర్ఘకాలిక పరిష్కారం
ఉద్యోగుల భవిష్యత్‌కు స్థిరమైన పెన్షన్ భద్రత కల్పించాలంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడంపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానం వైపు మార్పులు చేయగా, మరికొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానంలో మార్పులు చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేస్తూ ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పెన్షన్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలంగాణ ఉద్యోగులకు ఆర్థికంగా, సామాజికంగా మరింత భద్రత కల్పించే విధానాన్ని రూపొందించాలి.
- లింగమొల్ల దర్శన్‌గౌడ్,
తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
