కోట్లతో కట్టి వదిలేశారు..కరీంనగర్లో ఖాళీగా 50 మున్సిపల్ షట్టర్లు, స్మార్ట్ సిటీ కాంప్లెక్స్ లు

కోట్లతో కట్టి వదిలేశారు..కరీంనగర్లో ఖాళీగా 50 మున్సిపల్ షట్టర్లు, స్మార్ట్ సిటీ కాంప్లెక్స్ లు
  • ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్ ఇచ్చినా స్పందన కరువు
  • నేడు బహిరంగ వేలానికి ఏర్పాట్లు
  • ఒక్కో బిల్డింగ్ మొత్తాన్ని ఒక్కరికే లీజుకు ఇవ్వాలనే నిర్ణయంపై విమర్శలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన షట్టర్లు, కాంప్లెక్స్​లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. అద్దెకు తీసుకునేవారు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. కరీంనగర్​లో ప్రస్తుతం పలు షట్టర్లు, రూమ్​లు, బాంక్వెంట్ హాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వీటిని కిరాయికి ఇచ్చేందుకు ఇప్పటికే పలుమార్లు బల్దియా అధికారులు నోటిఫికేషన్ ఇచ్చినా పలు కారణాలతో తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వ టెండర్లకు స్పందన కరువైంది. ఈ క్రమంలోనే బల్దియా అధికారులు మరోసారి టెండర్లు పిలిచారు. ఈ నెల 1న మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో బహిరంగ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పదేండ్లుగా నిరుపయోగంగానే  మున్సిపల్ గెస్ట్ హౌస్ షట్టర్లు..

ఓల్డ్ మున్సిపల్ గెస్ట్ హౌస్​లో పదేండ్ల క్రితం రూ.5 కోట్లతో 26 షట్లర్లతో కూడిన కాంప్లెక్స్ నిర్మించారు. కమర్షియల్​గా ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ కాంప్లెక్స్ అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉంది. ఫస్ట్ ఫ్లోర్​లో 26 షట్టర్లు ఉన్నాయి. మున్సిపల్ ఆదా యాన్ని పెంచుకునేందుకు నిర్మించిన ఈ కాంప్లెక్స్.. పదేళ్లుగా నిరుపయోగంగానే ఉంది. ఈ షట్టర్ల విషయంలోనూ అప్పట్లో ఉన్న మున్సిపల్ ఆఫీసర్లు అడ్డగోలుగా అద్దెలు నిర్ణయించడంతోనే వ్యాపారులు ఎవరూ ముందుకు రానట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సుడా చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్న సమయంలో సుమారు రూ.కోటితో ఈ కాంప్లెక్స్​లో సౌకర్యాలు కల్పించి ఆధునికీకరించారు. గ్రౌండ్ ఫ్లోర్​లోని పార్కింగ్ ఏరియాతోపాటు 25 షట్టర్లతో కూడిన బిల్డింగ్ మొత్తాన్ని ఒకరికే లీజుకు ఇచ్చేందుకు తాజాగా నిర్ణయించారు. 

అలంకారప్రాయంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్  

కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం పరిధిలో స్మార్ట్ సిటీ ఫండ్స్ రూ.16 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కిరాయికి ఇచ్చేందుకు పలుమార్లు నోటిఫికేషన్ ఇచ్చినా పెద్దగా స్పందన రాలేదు. ఈ కాంప్లెక్స్ లో 22 కమర్షియల్ షట్టర్లతోపాటు హోటల్, హోటల్ రూమ్స్, బాంక్వెట్ హాల్ ఉన్నాయి. వీటిలో 8, 10, 17 నంబర్ గల షట్టర్లను మాత్రమే గతంలో అద్దెకు తీసుకున్నారు. మిగతా 19 షట్టర్లు, హోటల్ రూమ్స్, బాంకెట్ హాల్ ఖాళీగా ఉన్నాయి. వీటికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. పాత యునాని హాస్పిటల్ లో నిర్మించిన 8 షట్టర్లలో 7, 8 మినహా ఆరు షాపులతోపాటు ఫస్ట్ ఫ్లోర్​లోని ఓపెన్ హాల్(పాత పాస్ పోర్ట్ ఆఫీస్) కొన్నాళ్లుగా ఖాళీగానే ఉంటోంది.ఈ బిల్డింగ్ మొత్తాన్ని ఒక్కరికే అద్దెకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 

మూడు బిల్డింగులను  కొందరికి కట్టబెట్టేందుకేనా ?

ఖాళీ షట్టర్ల వేలం విషయంలో టెండర్ నోటిఫికేషన్ కనీసం నెల రోజుల ముందు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఐదు రోజుల ముందు రిలీజ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేలానికి ముందు ప్రీబిడ్డింగ్ సమావేశం కూడా నిర్వహించడం లేదు. ఎక్కువ సంఖ్యలో వేలందారులు పాల్గొనకుండా పరిమితం చేయడం, కొందరికే టెండర్ దక్కేలా కుట్రకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో షట్టర్​కు విడివిడిగా వేలం నిర్వహించాల్సి ఉండగా.. ఒక్కో బిల్డింగ్​ను ఒక్కరికే లీజుకు ఇస్తా మని నోటిఫికేషన్​లో పేర్కొనడం, బల్దియా పరిధి లోని వ్యక్తులు మాత్రమే పాల్గొనాలని నిబంధన  విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.