ఏపీ నీళ్ల దోపిడీపై మౌనం ఎందుకు?..అడ్డగోలుగా కృష్ణా జలాలను తరలిస్తున్నా ప్రభుత్వం నోరెత్తదా?: హరీశ్ రావు

ఏపీ నీళ్ల దోపిడీపై మౌనం ఎందుకు?..అడ్డగోలుగా కృష్ణా జలాలను తరలిస్తున్నా ప్రభుత్వం నోరెత్తదా?: హరీశ్ రావు
  • మన ప్రాజెక్టులు ఎండిపోతుంటే బేసిన్ దాటి నీళ్ల తరలింపునకు పరోక్ష సహకారం
  • అడ్డుకోవాల్సిన కృష్ణా బోర్డు చోద్యం చూస్తోంది 
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా కృష్ణా జలాలను దోచుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ మౌనం తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహమని అన్నారు. నీటి కేటాయింపులు లేకున్నా, వరద జలాలు రాకపోయినా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తోందని ఆరోపించారు. ఒకవైపు ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ సర్కార్ తెలంగాణ నీటి హక్కులపై దండెత్తుతోందని సోమవారం ఎక్స్ పోస్ట్ లో విమర్శించారు.

కృష్ణా బేసిన్‌‌లో భాగమైన భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టు ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ ద్వారా మన వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ సర్కార్ ఎందుకు నోరు మెదపడం లేదు? రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ చేస్తున్న తీరని అన్యాయమిది.

మన పొలాలకు నీళ్లు మళ్లించాల్సిన సీఎం.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు? ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కృష్ణా బోర్డు సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బోర్డే ప్రేక్షకపాత్ర పోషిస్తే రాష్ట్ర హక్కులను ఎవరు కాపాడాలి? ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి జోక్యం చేసుకోవాలి. కేఆర్ఎంబీపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి ఆయకట్టుకు నీరందించేలా చూడాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

ఆడబిడ్డల ప్రాణాలకు రక్షణ లేదు..

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆస్తులకే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని హరీశ్ విమర్శించారు. నర్సుగా సేవలందిస్తున్న ఓ ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెరిగిపోయాయి. మహిళలకు భద్రత కల్పించలేని సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా? ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే మీ సర్కార్ మేల్కొంటుంది?" అని ప్రశ్నించారు. 

ప్రభుత్వ బడుల మూసివేతకు కుట్ర

సిద్దిపేట రూరల్: సర్కారు బడులను మూసివేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ​హరీశ్​రావు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 27వేల స్కూళ్లను 4వేలకు తగ్గిస్తామని స్వయంగా సీఎం ప్రకటించారని అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి జడ్పీహెచ్ఎస్ టీచర్​ జోగు వెంకటేశం, న్యూ హై స్కూల్ జూనియర్ అసిస్టెంట్ కనకయ్య రిటైర్మెంట్​కార్యక్రమంలో ఆయన పాల్గొని  మాట్లాడారు. ‘ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు మా హయాంలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం చేపట్టాం.

కాంగ్రెస్ రాగానే దాన్ని రద్దు చేసింది. మూడేండ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క క్లాస్ రూమ్ కూడా కట్టలేదు. రిటైర్ అయిన వారి ప్లేస్​లో కొత్త టీచర్లను భర్తీ చేయడం లేదు. తక్షణమే డీఎస్సీ నిర్వహించాలి’ అని డిమాండ్​ చేశారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ లో హనుమాన్ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్​కు హాజరయ్యారు.