- ఇవ్వాల్సింది 8 లక్షల మందికి...
- హియరింగ్ కు వచ్చింది 11 వేలే..
- రాకపోతే ఫైనల్ లిస్టులో ఓటు ఉండదన్న అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎస్‌ఐఆర్‌లో భాగంగా జారీ చేసిన నోటీసులకు ఓటర్ల నుంచి స్పందన రావడం లేదు. నోటీసులు అందుకున్న చాలామంది హాజరుకాకపోవడంతో హియరింగ్కేంద్రాలు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 12,53,873 నోటీసులు జారీ చేయాల్సి ఉంగా, ఇప్పటివరకు 4,20,000 మందికి ఇచ్చారు. మిగతావి ఇచ్చే పనిలో ఉన్నారు. నోటీసులందుకున్న వారు ఆ నోటీసుల్లో పేర్కొన్న తేదీ, టైంకు హియరింగ్‌కు హాజరై అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్చూపడం లేదు. సోమవారం వరకు కేవలం11 వేల మంది మాత్రమే హియరింగ్ కు వచ్చి వివరణ ఇవ్వగా, సుమారు లక్ష మంది ఓటర్ల స్లాట్లు ల్యాప్స్ అయ్యాయి. మలక్ పేట, అంబర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో అయితే ఒక్క హియరింగ్ కూడా కాలేదు.
రెండు, మూడు చోట్ల ఫామ్స్ ఇవ్వడం వల్లేనా..
ఫామ్స్ లో 2002 వివరాలు లేదా కుటుంబసభ్యుల డిటెయిల్స్రాయకపోతే నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరు హైదరాబాద్‌లోని నియోజకవర్గంలోనే కాకుండా, పక్క నియోజకవర్గాల్లోనో లేదా వారి సొంత ఊళ్లలో ఓట్లు ఉండడం వల్ల ‘సర్’ ఫామ్‌లు అన్ని చోట్లా సమర్పించి ఉంటారని, అందుకే నోటీసులు ఇచ్చినా హియరింగ్‌కు రావడం లేదని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, అన్ని చోట్లా నోటీసులు వచ్చినా ఎక్కడో ఒక చోట హియరింగ్ కి తప్పని సరి వెళ్లాల్సిందేనంటున్నారు. హియరింగ్‌కు వెళ్లి అడిగిన పత్రాలు సమర్పించిన చోటనే ఓటు హక్కు వస్తుందంటున్నారు. ఇలా ఏదైనా ఒక్కచోటనే ఓటు హక్కు వచ్చే అవకాశం ఉండడంతో..ఎక్కడ ఓటు హక్కు తీసుకోవాలో డిసైడ్చేసుకోలేక ఆలస్యం చేస్తున్నారేమోనని అధికారులు భావిస్తున్నారు.
ముసాయిదాలో పేర్లు, ఇంటిపేర్లలో సమస్య..
మూసాయిదాలో ఓటర్ల పేర్లు ఉండటంతో కూడా చాలామంది హియరింగ్ కి రావట్లేదని తెలుస్తోంది. నోటీసులు వచ్చిన వారిలో చాలా వరకు ఇంటి పేర్ల(సర్నేమ్) కి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఇంటిపేరు పూర్తిగా లేకుండా ఒక అక్షరం ఉన్న వారికి నోటీసులు వచ్చాయి. ఉదాహరణకు ఇంతకుముందు ఓటర్ఐడీ కార్డుపై ఇంటి పేరు మొత్తం కొంతమందికి, ఒకే అక్షరం మరికొంతమందికి ఉండేది. అయితే ఇప్పుడు పూర్తి ఇంటి పేరు లేని ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. అంతా సరిగ్గా ఉన్నా కూడా తమకు ఎందుకు నోటీసులు వచ్చాయని వీరు ప్రశ్నిస్తున్నారు. చిన్న సమస్యే కదా అని వీళ్లు కూడా హియరింగ్ కి రావడంలేదు.
హియరింగ్‌కు రాకుంటే ఓటు కట్
నోటీసులందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరై అవసరమైన వివరాలు, పత్రాలు సమర్పించాల్సిందేనని లేకపోతే తుది ఓటర్ల జాబితాలో పేరు ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. హియరింగ్ కి అక్టోబర్ 15 వరకు మాత్రమే అవకాశం ఉందని, ఈ లోపు రావాల్సిందేనంటున్నారు. హియరింగ్ స్లాట్లు ల్యాప్స్ అయిన వారికి రిమైండర్ నోటీసులు కూడా జారీ చేయనున్నారు. ఇలా చివరి వరకు రాకుండా ఉన్న వారి ఓట్లు ట్టి పరిస్థితుల్లోనూ ఫైలన్ లీస్ట్ లో ఉండవని అధికారులు తేల్చిచెబుతున్నారు.
