- ఏడాదిలో 4 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లాస్
- సింగరేణి నుంచి జీ 9, 10 బదులు జీ 14, 15 కోల్ సప్లై
- నాలుగు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు
- 5 మిలియన్ టన్నుల మహానది కోల్ ఇప్పించాలని కేంద్రానికి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత సమస్యగా మారింది. సింగరేణి నుంచి జీ-9, 10 బొగ్గుకు బదులుగా నాణ్యత తక్కువగా ఉన్న జీ-14, 15 రకం బొగ్గు ఎక్కువగా సరఫరా అవుతోంది. దీంతో ప్లాంట్ల లోడ్ ఫ్యాక్టర్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. 2025–26లో విద్యుత్ ఉత్పత్తి 4 వేల మిలియన్ యూనిట్లకు పైగా తగ్గగా, జెన్‌కోకు రూ.2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జెన్‌కో ప్లాంట్ల వద్ద ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) రూల్స్ ప్రకారం 26 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. ఈ పరిస్థితుల్లో అదనంగా 5 మిలియన్ టన్నుల మహానది కోల్ సరఫరా చేయాలని జెన్‌కో సీఎండీ హరీశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
40 శాతమే నాణ్యమైన బొగ్గు..
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి ఇటీవల రాసిన లేఖలో జెన్‌కో సీఎండీ హరీశ్ బొగ్గు సరఫరా పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఏటా 28.87 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసేలా సింగరేణితో ఒప్పందం ఉందని తెలిపారు. అయితే 2025–26లో సింగరేణి నుంచి 76 శాతం మాత్రమే సరఫరా జరిగిందని, అందులో ఎఫ్‌ఎస్‌ఏ గ్రేడ్ ప్రకారం నాణ్యమైన బొగ్గు 40 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. బొగ్గు నాణ్యత, పరిమాణంలో లోటు కారణంగా జెన్‌కో థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. జెన్‌కో అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేకపోతున్నట్లు సింగరేణి సైతం ఫిబ్రవరి 26, 2026న లేఖ ద్వారా తెలిపిందని గుర్తుచేశారు.
జీ-9, 10 బొగ్గే అవసరం..
జెన్‌కో థర్మల్ ప్లాంట్లలో అధిక నాణ్యత గల జీ-9, 10 రకం బొగ్గు వినియోగించేలా పలు యూనిట్లను రూపొందించారు. 500, 800 మెగావాట్ల సామర్థ్యం గల కేటీపీఎస్ 6, 7 యూనిట్లతో పాటు 4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(వైటీపీఎస్)ను ఈ రకం బొగ్గు కోసం రూపొందించారు. అయితే నాణ్యమైన బొగ్గు తగినంత సరఫరా కాకపోవడంతో ఈ యూనిట్లు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి.
నాణ్యత లేని బొగ్గు వినియోగం కారణంగా 2025–26లో 4 వేల మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, దీంతో సంస్థకు రూ.2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. వైటీపీఎస్‌లోని మూడు యూనిట్ల(2,400 మెగావాట్లు)కు మాత్రమే బొగ్గు సరఫరా చేయగలమని సింగరేణి ఇప్పటికే జెన్‌కోకు తెలిపింది. మిగిలిన రెండు యూనిట్ల(1,600 మెగావాట్లు)కు కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా ప్రత్యామ్నాయ వనరుల నుంచి బొగ్గు సరఫరా చేసుకోవాలని సూచించింది.
