పంట కాల్వలు పారుతలేవు.. ప్రధాన జలాశయాల కాల్వలకు మరమ్మతులు లేక సాగునీటికి అడ్డంకులు

పంట కాల్వలు పారుతలేవు.. ప్రధాన జలాశయాల కాల్వలకు మరమ్మతులు లేక సాగునీటికి అడ్డంకులు
  • ప్రధాన జలాశయాల కాల్వలకు మరమ్మతులు లేక సాగునీటికి అడ్డంకులు 
  • రామప్ప ఒగరు కాలువకు బుంగ
  • పదేండ్లుగా పట్టింపులేని మల్లూరు నర్సింహసాగర్​ ప్రాజెక్టు
  • వేసిన పంటలకు సాగునీరు అందించాలంటున్న రైతులు

 

ములుగు, వెలుగు : ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసుకునే రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటికే నాట్లు వేసుకున్న రైతులు ఉన్న కాస్త నీటినైనా పొదుపుగా వినియోగించుకునేందుకు సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ప్రధాన జలాశయాల పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడం, పలుచోట్ల బుంగలు పడటం, బురద, చెట్లు పెరగడంతో నీటి వృథా అవుతుందని, చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, రైతులతో నిర్వహించిన సమీక్షలో సమస్యలను ఏకరువు పెట్టారు.

రామప్ప ఒగరు కాలువకు బుంగ..

వెంకటాపూర్‌‌‌‌ మండలం పాలంపేట సమీపంలోని రామప్ప సరస్సు ద్వారా అధికారికంగా 5,180 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మరో 1,700 ఎకరాలకు కొండాపూర్, పూలవాసు మాటు ద్వారా నీరందుతుంది. మత్తడి నీరు మోరంచ కాలువ ద్వారా సుమారు 14 గ్రామాల పరిధిలోని పంటలకు చేరడంతో మొత్తం 15 వేల ఎకరాలకు సాగునీరు అందేది. ప్రస్తుత పరిస్థితుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని రామప్పలోకి డంపింగ్‌‌‌‌ చేస్తుండటంతో నీటి నిల్వలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి నర్సంపేట నియోజకవర్గంలోని రంగాయ చెరువు, పాకాల సరస్సులకు నీటిని తరలిస్తున్నారు. రామప్ప చుట్టుపక్కల రైతులు నారుమళ్లు పోసుకుని నాట్లు వేసుకున్న నేపథ్యంలో సాగునీరు అందించాలని కోరుతున్నారు. గత నెలలో నీటి విడుదలపై కలెక్టర్‌‌‌‌కు విన్నవించగా, 20 రోజులుగా నీరందిస్తున్నట్లు ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. అయితే ఒగరు కాలువకు గండిపడటంతో నీరు వృథా అవుతోందని రైతులు కలెక్టర్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే బుంగను పూడ్చాలని అధికారులను ఆదేశించారు.

లక్నవరం కాలువల పూడిక తీసిన రైతులు..

గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు ద్వారా 8,790 ఎకరాలకు సాగునీరు అందించే కెపాసిటీ ఉంది. వర్షాలు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం 4 వేల నుంచి 5 వేల ఎకరాల మధ్యే సాగు జరుగుతోంది. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 50 శాతం కంటే తక్కువగా ఉంది. సరస్సు నుంచి పొలాలకు నీరు తరలించే రెండు పంట కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో రైతులే చందాలు వేసుకుని సుమారు 2 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేపట్టారు. ఏటా ఆఫీసర్లు చేయాల్సిన పనులను తామే చేసుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. లక్నవరం నుంచి జంపన్నవాగులోకి నీటిని తరలించాల్సి ఉండగా, ఈసారి మినీ జాతరలో పుణ్యస్నానాలకు నీటి సౌకర్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రామప్ప-లక్నవరం సరస్సుల అనుసంధానం పూర్తయితే దేవాదుల నీటిని లక్నవరానికి తరలించే అవకాశం ఉంది.

మరమ్మతులకు నోచుకోని నర్సింహసాగర్..

మంగపేట మండలంలోని మల్లూరు ప్రాజెక్టు (నర్సింహసాగర్) పదేండ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం సుమారు 115.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 0.367 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 7,500 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టుకు 8 కిలోమీటర్ల ఎడమ కాలువ, 17 కిలోమీటర్ల కుడి కాలువ ఉన్నాయి. వీటి ద్వారా తిమ్మంపేట, చెరుపల్లి, బాలన్నగూడెం, బుచ్చంపేట, మంగపేట, నర్సాపూర్ బోర్, నర్సింహసాగర్, పూరేడుపల్లి, నడింగూడెం, రాజుపేట, రమణక్కపేట, చుంచుపల్లి, మల్లూరు తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. తూముల షట్టర్ల లీకేజీలు, కాలువల మరమ్మతులు, పూడికతీత, చెట్ల తొలగింపు పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా గోదావరిలో కలుస్తోందని రైతులు చెబుతున్నారు. 2025 జూన్‌‌‌‌లో కుడి కాలువలోని మూడు డిస్ట్రిబ్యూటరీ కాల్వల రెగ్యులేటర్‌‌‌‌ వాల్ మరమ్మతులకు రూ.4.80 లక్షల డీఎంఎఫ్‌‌‌‌టీ నిధులు మంజూరైనా పనులు పూర్తికాలేదని, బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలెంవాగు 13 డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులేవి?

వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టు పరిధిలో 5 వేల ఎకరాల వరి సాగు సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రధాన కాలువ పూడికతీత పూర్తయినా పిల్ల కాల్వల పనులు పూర్తికాలేదు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటరీ గేట్లు ఉండగా, అవి పనిచేయక నీరు వృథా అవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండటం లేదని, ప్రాజెక్టు పరిరక్షణ కొరవడిందని చెబుతున్నారు. ములుగు జిల్లాలోని జలాశయాలు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టి కాలువల్లో పూడికతీత, చెట్ల తొలగింపు పనులు పూర్తిచేస్తే రైతుల సాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఎల్నినో పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో రైతుల సమస్యలను విన్న కలెక్టర్ పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆరుతడి పంటలు సాగు చేయడంతోపాటు ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

ఆరుతడి పంటలు సాగుచేయండి..

ములుగు జిల్లాలో గతేడాదితో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావం ఉన్నందున ఇప్పటికే సాగు చేసిన రైతులు ఉన్న కాస్తనీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. ఆరుతడి పంటలు వేసుకొని ఆర్థికంగా మంచి దిగుబడి సాధించుకోవచ్చు. సరస్సులు, చెరువులు, ప్రాజెక్టుల పూడికతీత పనులు పూర్తిచేసి, నీటి వృథా లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆఫీసర్లను సంప్రదించాలి.
- బోర్ఖడే హేమంత్ సహదేవరావు, కలెక్టర్, ములుగు