ఇందిరమ్మ టవర్స్ లాటరీ పూర్తి.. తొలి విడతలో 7 వేల 340 ఫ్లాట్లకు లక్కీ డ్రా

ఇందిరమ్మ టవర్స్ లాటరీ పూర్తి.. తొలి విడతలో 7 వేల 340 ఫ్లాట్లకు లక్కీ డ్రా
  • మరో 4 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో తప్పుల సవరణకు చాన్స్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి లాటరీ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన డ్రా ప్రక్రియలో నాలుగు రోజుల పాటు రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 16 నియోజకవర్గాల్లో తొలి దశ పైలట్ ప్రాజెక్టుగా 480 ఫ్లాట్ల చొప్పున మొత్తం 7,340 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు.

ఇందుకోసం సుమారు 60,720 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపు 41 వేల మంది డ్రాకు అర్హత సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలి విడతగా 140 ఫ్లాట్లు నిర్మిస్తుండడంతో వాటికి మాత్రమే లాటరీ నిర్వహించారు. 

మరో నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ..

ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 3 వరకు గడువు విధించారు. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు సూచించింది. 

సవరణలకు అవకాశం..

కొందరు దరఖాస్తుదారులు తమ నియోజకవర్గానికి బదులుగా పొరపాటున వేరే నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు హౌసింగ్ బోర్డు గుర్తించింది. దీంతో దరఖాస్తులో నమోదైన నియోజకవర్గాన్ని మార్చుకునే సదుపాయాన్ని తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి తెచ్చింది. లాటరీలో ఎంపికైన వారి వివరాలను తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. అభ్యంతరాలకు కూడా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 

క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే కేటాయింపు..

లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయి ధ్రువీకరణ చేపడతారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. కుటుంబ వివరాలు, నివాసం, ఆదాయం, ఇంటి యాజమాన్యం తదితర అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే కేటాయింపును ఖరారు చేస్తామని చెప్పారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన కుటుంబాలకే ఇందిరమ్మ ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లాటరీతో పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడం, క్షేత్రస్థాయి పరిశీలన వంటి తనిఖీ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వివరించారు.