తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్న శుభవేళ రాష్ట్రంలో ఒక కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన, సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి, మహిళా సాధికారత, విద్య, వైద్యం, అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామికాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యతిస్తూ ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా రాష్ట్రం దూసుకుపోతోంది.
ఇచ్చిన హామీలు అమలుచేస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతూకంగా ముందుకు తీసుకెళ్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వెయ్యి రోజుల సుపరిపాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ... ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలుచేస్తున్న పథకాలతో ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని స్పష్టమవుతోంది. రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల మయంగా మారి ఆర్థికంగా పలు సవాళ్లు ఎదురవుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యతిచ్చింది.
రాష్ట్రంలో ప్రజావాణి, గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజావసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెయ్యి రోజుల పాలనలో రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించింది. రూ.20 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేసి 25.35 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి విముక్తి కల్పించింది. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించింది. ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.30 వేల కోట్లు, సన్న వడ్ల బోనస్‌కు దాదాపు రూ.4 వేల కోట్లు, రైతుబీమాకు రూ.3,500 కోట్లు ఖర్చుచేసి తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ వంటి అంశాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అన్నదాతల్లో భరోసా నింపింది. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతిస్తూ మహాలక్ష్మి పథకంలో భాగంగా సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా 2023 డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి 30 నెలల్లో ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర ఖర్చు చేయడంతో స్త్రీలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం కలిగింది.
అంతేకాక, మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రూ.27 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములుగా తీర్చిదిద్దింది.
70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు
నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4.5 లక్షల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థికభారాన్ని తగ్గించేందుకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు రూ.500కే ఎల్పీజీ సిలిండర్ పంపిణీ చేస్తోంది. దీర్ఘకాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం 16.32 లక్షల కొత్త కార్డులు జారీ చేయడంతో రాష్ట్రంలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోంది.
పేదల ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టడం చారిత్రాత్మకం. ప్రత్యేక రాష్ట్రంలో తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించి భంగపడ్డ తెలంగాణ యువతలో విశ్వాసం కలిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఉద్యోగ నియామకాలతో పాటు నైపుణ్యాభివృద్ధిపై కూడా దృష్టిపెడుతూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయడం వంటి చర్యల ద్వారా భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దుతోంది.
జెన్ జీకి ప్రాధాన్యత
యువతను పాలనా వ్యవస్థలో భాగస్వాములను చేయాలనే సంకల్పంతో 21 ఏళ్లకే చట్టసభల్లో పోటీచేసే అవకాశం కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జెన్- జీకి కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. విద్యారంగంలోనూ ప్రభుత్వం కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్తోంది. విద్యార్థుల పోషకాహారంపై దృష్టి పెడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో అల్పాహారం ప్రారంభించింది.
రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి నడుం బిగించింది. భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌తో ముందుకుసాగుతూ 2047 నాటికి
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంతోపాటు తెలంగాణను ప్రపంచ స్థాయి పారిశ్రామిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
కేంద్రం వివక్ష ధోరణి ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు
బీఆర్‌ఎస్, బీజేపీ వ్యవహరించడం దురదృష్టకరం. రెండు దఫాల పదేండ్ల కేసీఆర్ పాలనలో సాధించని అభివృద్ధి వెయ్యి రోజుల రేవంత్ రెడ్డి పాలనలో పూర్తవడంతో ఇక ప్రజలు తమను ఆదరించరనే అసహనం బీఆర్‌ఎస్‌లో నెలకొంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ తెలంగాణపై వివక్ష చూపించడం దురదృష్టకరం. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలను తొక్కిపెట్టకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయ సహకారాలందితే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతిపక్షాలు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుండడంతో మల్లికార్జున్ ఖర్గే మార్గదర్శకంలో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడమే కాకుండా, రాహుల్ గాంధీ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఖాయం.
రైతు సంక్షేమం నుంచి మహిళా సాధికారత వరకు, యువతకు ఉద్యోగాలు, -నైపుణ్యాలు, విద్య, వైద్యం మరోవైపు మౌలిక వసతులు, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం వేస్తున్న అడుగులు తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యం ప్రగతిపథంలో వెయ్యి రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రజా సంక్షేమాన్ని పునాదిగా, అభివృద్ధిని లక్ష్యంగా, ‘తెలంగాణ రైజింగ్-2047’ను భవిష్యత్ దిశగా చేసుకున్న ఈ వెయ్యి రోజుల ప్రయాణం రాబోయే సంవత్సరాల్లో మరింత ప్రగతికి పునాది అవుతుంది.
బీసీ కులగణన గొప్ప విజయం
ఎవరికెంతో వారికంత న్యాయం జరగాలనే రాహుల్ గాంధీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయడం వంటి విప్లవాత్మక చర్యలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.
చారిత్రాత్మక హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు పెద్దపీట వేస్తోంది. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌కు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. ఇందిరమ్మ రాజ్యం పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్న వెయ్యి రోజులు కేవలం పాలనా ఒక మైలురాయి మాత్రమే కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాల పేదలపై ప్రత్యేక దృష్టితో పాటు మౌలిక వసతులు, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యతిచ్చిన కాలంగా వెయ్యి రోజుల పాలనను చూడవచ్చు.
- బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
