బషీర్‌బాగ్, వెలుగు: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి స్వాతంత్య్ర సమరయోధురాలు, మాజీ ఎంపీ సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో-చైర్మన్ టి.నందగోపాల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగం లక్ష్మీబాయి సైదాబాద్ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు విద్యనందించడంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రభుత్వాలు జాతీయ విమానాశ్రయాలు, పార్కులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, క్రీడా మైదానాలు, రహదారులకు అగ్రకులాలకు చెందిన ప్రముఖుల పేర్లనే పెడుతున్నాయని విమర్శించారు.
బీఆర్‌ఎస్ శాసనమండలి పక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. స్వర్గీయ ఇందిరాగాంధీ కంటే ముందే పార్లమెంటులో ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టిన తొలి మహిళల్లో లక్ష్మీబాయి ఒకరని తెలిపారు. స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టడంతోపాటు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్కుర్మా, బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, వినయ్ కిశోర్‌యాదవ్, రావులకోల్నరేశ్ప్రజాపతి, బండారు యోగి పాల్గొన్నారు.
