బతికున్నరో.. లేదో..!.. నేపాల్లో ఇప్పటికీ చిక్కని 4 వేల మంది ఆచూకీ

బతికున్నరో.. లేదో..!.. నేపాల్లో ఇప్పటికీ చిక్కని 4 వేల మంది ఆచూకీ
  • జలప్రళయంలో 903కు చేరిన మృతుల సంఖ్య
  • గల్లంతైన వారిలో 591 మంది విదేశీయులు

ఖాట్మాండు: నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరద మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం నాటికి 903 మృతదేహాలను వెలికితీసినట్టు విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఏ) వెల్లడించింది. రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగిస్తూ బాధితుల కోసం గాలిస్తుండగా.. మృతదేహాలు బయటపడుతున్నాయి. చిత్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 272 డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీలు, తూర్పు నవల్​పరాసిలో 207, పశ్చిమ నవల్​పరాసి 151, నువాకోట్ 95, గోర్ఖా 62, ధాడింగ్ 55, తనహు 37, రసువాలో 24 మృతదేహాలు లభ్యమయ్యాయి. 

మరో 4,247 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారిలో 99 మంది భద్రతా సిబ్బంది, 591 మంది విదేశీయులు ఉన్నారు. సుమారు 6 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 933 మంది కార్మికులు చిక్కుకుపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని దేశం ఊహించని గుండెకోతగా ప్రధాని బాలేంద్ర షా అభివర్ణించారు. ఆగస్టు 19న మంచు, రాళ్లు, బురద కలిసి గ్రామాలను ముంచెత్తడంతో నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సరిహద్దులోని టిబెట్ పరిధిలోనూ తీవ్ర ప్రాణనష్టం సంభవించింది.

టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 93 మంది కార్మికులు గల్లంతు

రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిక్కుకున్నట్టు భావించిన 93 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. భోటే కోశీ నది ఉగ్రరూపం దాల్చడంతో వరద నీరు ముంచెత్తిన ఈ సొరంగంలోకి నేపాలీ ఆర్మీ, ఇంజనీర్లు ఆధునిక థర్మల్ డ్రోన్లను పంపించి చిట్టచివరి భాగం వరకు గాలించారు. లోపల మనుషులు చిక్కుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో సహాయక బృందాలు వెనుదిరిగాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించే 933 మంది ఆచూకీ గల్లంతైనట్టు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించగా, ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టుల టన్నెళ్ల నుంచి 279 మందిని మాత్రమే రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి.

నేపాల్, చైనాలో 262 మంది మహారాష్ట్రవాసులు 

వరద ప్రభావిత నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన 262 మంది చిక్కుకుపోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకూ 144 మందిని సురక్షితంగా భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఇందులో 105 మంది నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, 39 మంది ముంబైకి చేరుకున్నారు. ఇంకా ఆచూకీ లభించని 64 మంది కోసం భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.