నేపాల్ వరదల్లో మణికొండ వాసి గల్లంతు! -

నేపాల్ వరదల్లో మణికొండ వాసి గల్లంతు! -

గండిపేట, వెలుగు: నేపాల్‌‌ వరదల్లో మణికొండకు చెందిన ధన్‌‌పాల్‌‌రెడ్డి గల్లంతయ్యాడేమోనని ఆయన కుటుంసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల ట్రిప్‌‌లో భాగంగా ధన్‌‌పాల్‌‌రెడ్డి గత నెల 23న ఆదివారం నేపాల్‌‌కు వెళ్లారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా సుమారు 60 మందితో కూడిన బృందం ఈ పర్యటనకు వెళ్లింది. అయితే, అక్కడ ఒక్కసారిగా ముంచుకొచ్చిన భారీ వరదల కారణంగా ఆయనతో కుటుంబసభ్యులకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ధన్‌‌పాల్‌‌రెడ్డితో చివరిసారిగా గత మంగళవారం ఫోన్‌‌లో మాట్లాడినట్లు వారు తెలిపారు. 

ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ లేకపోవడం, అక్కడి విపత్కర పరిస్థితుల గురించి టీవీలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో వారి భయం మరింత పెరిగింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. ధన్‌‌పాల్‌‌రెడ్డి ఆచూకీ తెలుసుకుందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత అధికారులు, నేపాల్‌‌లోని ఇండియన్​ఎంబసీ చొరవ చూపాలని కోరుతున్నారు.