- బ్యాంకు లోన్ రాక ఆలస్యమవుతున్న పనులు
- కాంట్రాక్ట్ సంస్థ సొంత నిధుల వినియోగానికి సర్కారు అనుమతి
- ఇందుకు హ్యామ్ నిబంధనల ప్రకారం 10.36 శాతం వడ్డీ
- రూ.7,360 కోట్లతో మూసీ పునరుజ్జీవానికి గోదావరి జలాల తరలింపు
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవనానికి గోదావరి జలాలను తరలించే ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రూ.7,360 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌కు బ్యాంకు రుణం మంజూరు కాకపోవడంతో.. పనుల కోసం కాంట్రాక్ట్ సంస్థ అంతర్గత నిధులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే హ్యామ్ నిబంధనల ప్రకారం పదేండ్ల పాటు 10.36 శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రాజెక్ట్ పనులు వేగం పుంజుకోనున్నాయి.
10 టీఎంసీల పైప్‌లైన్లు రెండు..
గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్ మెగా సిటీ తాగునీటి అవసరాల కోసం ఈ పనులు చేపడుతున్నారు. హ్యామ్ పద్ధతిలో పనులు చేసేందుకు 2025 జనవరిలో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) పనులు దక్కించుకుంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పదేండ్ల పాటు ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలు కూడా సంస్థే చేపట్టనుంది.
మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు రెండు వరుసల్లో ఒక్కొక్కటి 10 టీఎంసీల సామర్థ్యంతో ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్లు నిర్మించనున్నారు. మల్లన్నసాగర్ వద్ద పంప్‌హౌస్, ఎలక్ట్రో మెకానికల్ పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఘన్‌పూర్‌లో రోజుకు 1,170 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్, 40 ఎంఎల్ సామర్థ్యంతో క్లియర్ వాటర్ రిజర్వాయర్ కమ్ పంప్‌హౌస్ నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 60 శాతం కాంట్రాక్ట్ సంస్థ భరించాల్సి ఉంటుంది.
ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటు చేసి..
కాంట్రాక్ట్ సంస్థ భరించాల్సిన 60 శాతం నిధులను బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంది. 2025 డిసెంబర్ 12న డేట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు రుణం మంజూరు కాలేదు. దీంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్గత నిధులను వినియోగించుకునేందుకు అనుమతించాలని, అందుకు 10.36 శాతం వడ్డీ చెల్లించేలా ఆమోదం ఇవ్వాలని ఎంఈఐఎల్ కోరింది. ఇందుకోసం ‘మల్లన్నసాగర్ వాటర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రత్యేక ప్రయోజన సంస్థ(ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేసింది.
అంతర్గత నిధుల వినియోగానికి హ్యామ్ నిబంధనలు అనుమతిస్తాయా? అనే అంశంపై జలమండలి ఎండీ.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ని సంప్రదించారు. అర్హత ఉందని ఎన్‌హెచ్‌ఏఐ జీఎం జులై 20న జలమండలికి మెయిల్ ద్వారా తెలియజేశారు. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని 10.36 శాతం వడ్డీ చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తర్వులకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీని ఆదేశించింది.
