జూన్ క్వార్టర్లో జీడీపీ జోరు.. ఈసారి 7.8 శాతం వృద్ధి

జూన్ క్వార్టర్లో జీడీపీ జోరు.. ఈసారి 7.8 శాతం వృద్ధి
  • గత ఏడాది 6.7 శాతం మాత్రమే
  • భారీగా ఎగుమతులు, వినియోగమే కారణాలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నడుమ కూడా భారత ఆర్థిక వ్యవస్థ సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్​క్వార్టర్లో   జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే ఇది భారీ వృద్ధి.  నామినల్ జీడీపీ గత ఏడాది 8.1 శాతం వృద్ధితో పోలిస్తే ఈసారి 10.8 శాతానికి చేరింది. మొదటి క్వార్టర్​లో మనదేశ వృద్ధి రేటు ఏడు శాతం ఉండొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది.  

ఈ క్వార్టర్​లో ప్రాథమిక రంగాల పనితీరు మిశ్రమంగా ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి గత ఏడాది 4.4 శాతం నుంచి ఈసారి 2.4 శాతానికి తగ్గింది. గనుల రంగం గత ఏడాది 12.4 శాతం వృద్ధిని సాధించగా, ఈసారి 0.4 శాతం క్షీణతను చూసింది. తయారీ రంగం గత ఏడాది 6.1 శాతంతో పోలిస్తే ఈసారి 8.2 శాతం వృద్ధి సాధించింది. విద్యుత్ రంగం గత ఏడాది 2.8 శాతం తగ్గగా, ఈసారి 8.5 శాతం భారీ వృద్ధిని కనబరిచింది. 

నిర్మాణ రంగం 5.2 శాతం నుంచి 7.7 శాతానికి విస్తరించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు, ఆదాయపు పన్ను రాయితీలు ప్రజల ఆదాయాన్ని పెంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తోడ్పడ్డాయి. దేశీయ వినియోగం, స్థిరమైన ఎగుమతులు, ప్రభుత్వ మూలధన వ్యయం, సర్వీస్​ సెక్టర్​ వృద్ధి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాయి.

ప్రధాని మోదీ హర్షం

జీడీపీ వృద్ధిపై  ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ 7.8 శాతం వృద్ధి దేశ ప్రజల బలమైన శక్తికి నిదర్శనమని ప్రశంసించారు. అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు, సరఫరా సమస్యలు ఎదురైనా ఆర్థిక వ్యవస్థ దృఢంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈసారి పారిశ్రామిక ఉత్పత్తి సగటున 3.7 శాతానికి , వాహన అమ్మకాలు 10.4 శాతానికి చేరాయి. విద్యుత్ డిమాండ్ 8.4 శాతానికి పెరిగింది. 

కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 39.9 శాతానికి పెరిగింది. సేవల రంగ పీఎంఐ సూచీ 58.6 స్థాయికి ఎగిసింది. సేవల ఎగుమతులు 16.2 శాతానికి చేరాయి. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. ఆలోపు భారత్‌‌‌‌‌‌‌‌ను ధనికదేశంగా తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.  ఇది సాధ్యం కావాలంటే రాబోయే 21 ఏళ్ల పాటు జీడీపీ ఏటా సగటున 9.03 శాతం పెరగాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు