వెలుగు స్పెషల్ : ది లిమిట్స్ టు గ్రోత్ ..తెలంగాణకు నీరే చమురు!

వెలుగు స్పెషల్ : ది లిమిట్స్ టు గ్రోత్ ..తెలంగాణకు నీరే చమురు!

పర్యావరణానికి, ఆర్థిక రంగానికి ముడిపెట్టిన మొదటి విశ్లేషణ 1972 నాటి 'లిమిట్స్ టు గ్రోత్'.  ప్రకృతి వనరుల ఉపయోగంపైన ఆధారపడిన అభివృద్ధికి పరిమితులున్నాయి అని రుజువు చేసిన ఈ విశ్లేషణలో ఇమిడి ఉన్న దృక్పథం అప్పటికీ, ఇప్పటికీ పాలకులకు పట్టలేదు. అప్పటి ఆర్థిక నమూనా నీటిని ఒక స్వతంత్ర  ప్రపంచస్థాయి పరిమితిగా కాకుండా ప్రధానంగా వ్యవసాయ, పర్యావరణ పరిమితులలోని ఒక అంశంగా పరిగణించింది. 

'లిమిట్స్ టు గ్రోత్'పై ఉన్న ప్రధాన విమర్శలలో ఒకటి ఏమిటంటే, అది అనేక పర్యావరణ ప్రక్రియలను కలిపివేసింది. నీటి కొరత, భూగర్భ జలాల క్షీణత, నదీ పరీవాహక ప్రాంతాల ఒత్తిళ్లు, ప్రాంతీయ కరువులు వంటివి ప్రపంచ వనరుల క్షీణతకు చాలాకాలం ముందే పరిమితంచేసే కారకాలుగా గుర్తించినప్పటికీ వాటిని ఇందులో స్పష్టంగా విశదీకరించలేదు. 

తెలంగాణకు నీరు.. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలలోని చమురు వంటిది.  జీఎస్‌‌‌‌డీపీ  గణనలో దీనిపాత్ర ఎవరూ పరిశీలించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ,  ఇంకా వివిధ రకాలుగా  నీటిని నిత్యం ప్రస్తావించే ఈ సమాజం, అభివృద్ధిలో  నీటిపాత్ర మీద  అధ్యయనాలు చేయలేదు.

రాజకీయ నాయకులు దానిని ఒక భావోద్వేగ బూచిగా వాడుకున్నారు తప్పితే,  వారికీ లోతైన అవగాహన లేదు.  ప్రభుత్వ సంస్థలు అయితే ఇంకా ఈ విషయంలో డోలాయమానంలో పడుతున్నాయి తప్పితే, ఒక శాస్త్రీయ ఆలోచనవైపు అడుగులు వేయడం లేదు.  ప్రత్యక్షంగా రాష్ట్ర ఆదాయంలో నీటిపాత్ర అంచనాలు లేనప్పటికీ,  స్వల్ప మొత్తంగా భావించేవారు కూడా అంగీకరించాల్సిన వాదన ఏందంటే  ప్రతి సంవత్సరం అనేక లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు నీరే ఆధారం. నీరు కేవలం ప్రాణానికే కాదు, ఆర్థిక రంగానికి ప్రధాన వనరుగా పరిగణించాలి. 

ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు పునాది జల భద్రత

తెలంగాణ ఆర్థిక ప్రణాళిక, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు జల భద్రత పునాది.  జీవానికి నీరు అత్యవసరం.  నీరు వ్యవసాయం, పరిశ్రమలు, శక్తి ఉత్పత్తి, పట్టణీకరణ,  సరఫరా గొలుసులు, ఉపాధిని నిలబెడుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో నీటి వనరుల పాత్ర, దాని ఆర్థిక ప్రాముఖ్యతను తగినంతగా అంచనా వేయలేకపోతున్నాం.  నీరు ఆర్థిక కార్యకలాపాలను సాధ్యం చేస్తుంది. అభివృద్ధిని సుస్థిరం చేస్తుంది. అదే సమయంలో దాని కొరత మొత్తం ఆర్థిక వ్యవస్థలను బలహీనపరుస్తుంది. ద్రవ్యోల్భణం వస్తుంది.  

నిత్యావసరాల ధరలు మరింత పెరుగుతాయి.  సమాజంలో అశాంతి పెరుగుతుంది.  ఈ నేపథ్యంలో  తెలంగాణకు సంబంధించి ఒక ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే... నిత్యం ప్రభుత్వాధినేతలు  ప్రకటించే రాష్ట్ర ఆర్థికవృద్ధి  ఏ మేరకు విశ్వసనీయ,  స్థిరమైన నీటి లభ్యతపై ఆధారపడి ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం,  ఆర్థికవృద్ధి, వాతావరణ సంక్షోభం, పెట్టుబడుల పట్ల  ప్రభుత్వ విధానాన్ని పునర్నిర్మించగలదు. 

భూమి, అడవులు, నేల,  నీరు కలగలిపిన పర్యావరణం నుంచే మనకు నీరు లభిస్తుంది.  ఎక్కడ ఈ ప్రకృతి  వనరులు విధ్వంసం అవుతాయో అక్కడ  నీటికొరత ఏర్పడుతుంది.  కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు ఆద్యంతం కరువుతో అల్లాడుతున్నాయి.

గల్ఫ్ ఆయిల్ పోలిక

గల్ఫ్ దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థలో చమురు కీలక స్థానాన్ని ఆక్రమించింది. తెలంగాణలో నీరు అదే విధమైన పాత్ర కాకపోయినా, దానికి సమానమైన పాత్రను పోషిస్తుంది. చమురులా నీరు ప్రధానంగా భారీ ప్రత్యక్ష ఆదాయాలను ఆర్జించే ఎగుమతి వస్తువు కాదు. దాని ఆర్థిక విలువ వివిధ రంగాలలో విస్తరించి ఉంది. ఇది వ్యవసాయ ఉత్పత్తిని నిలబెడుతుంది.
 
పారిశ్రామిక ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది, పట్టణాభివృద్ధిని సాధ్యం చేస్తుంది, లక్షలాది మంది జీవనోపాధికి ఆధారం. ప్రత్యేక ఆర్థిక రంగంగా కనిపించకుండా, పొలాలు, కర్మాగారాలు, వ్యాపారాలు, సేవల ఉత్పత్తిలో అంతర్లీనంగా ఉంటుంది.

 తెలంగాణ రైజింగ్ 2047 పత్రం ప్రకారం.. 2024–25లో తెలంగాణ సాధారణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి  రూ.16.41 లక్షల కోట్లుగా అంచనా. 2023–24లో  రాష్ట్ర స్థూల విలువ జోడింపులో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల వాటా 15.8% కాగా, సేవల రంగం 65.7%, పరిశ్రమ 18.5% వాటాను అందించాయి. ఈ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ  వైవిధ్యాన్ని వెల్లడిస్తాయి. కానీ  ప్రతీరంగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నీటిపై ఎంత ఆధారపడి ఉందో అవి వెల్లడించవు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నీటిపై ఎంత ఆధారపడి ఉంది?

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40–50%  విశ్వసనీయమైన నీటి లభ్యతపై గణనీయంగా ఆధారపడి ఉండవచ్చనేది ఒక ప్రాథమిక అంచనా.  దీనిని ఒక పరిశోధన ప్రతిపాదనగా పరిగణించాలి, నిర్ధారిత గణాంక ఫలితంగా కాదు. 2024–25 నాటి రూ.16.41 లక్షల కోట్ల జీఎస్‌‌‌‌డీపీ గణాంకాన్ని ఉపయోగించి చూస్తే,  ఇదే మొత్తం ఉత్పత్తిలో  సుమారు 43–55 శాతానికి  ప్రాతినిధ్యం వహిస్తుంది. 

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్  2024 అంచనా ప్రకారం తెలంగాణ వార్షిక భూగర్భ జలాల వెలికితీత సుమారు 8.47 బిలియన్ క్యూబిక్ మీటర్లు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఇందులో సాగునీటి కోసం దాదాపు 90% వినియోగిస్తున్నారు. ఇతర ఉపయోగాల మీద లెక్కలు లేవు. అంచనాలు అంతకన్నా లేవు. ఈ లెక్క వ్యవసాయ ఉత్పత్తికి భూగర్భ జలాల ప్రాముఖ్యతను, నీటి లభ్యతలో మార్పుల వల్ల గ్రామీణ జీవనోపాధులు ఎంతగా ప్రభావితమవుతాయో తెలియజేస్తుంది. 

హైదరాబాద్ నగరం తన నీటి అవసరాలకు దాదాపు 70 శాతం భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉన్నది. పరిశ్రమల పరిస్థితి కూడా దాదాపు అంతే. రాష్ట్ర నేతలు పదేపదే వల్లెవేసే ఫార్మా, ఐటి రంగాలకు కూడా ఈ జలాలే ఆధారం. అందువల్ల రాష్ట్రం నీటిపై ఆధారపడిన ఆర్థిక విలువను కొలవడం, వివిధ నీటి కొరత పరిస్థితులలో కలిగే నష్టాలను విడిగా అంచనా వేసేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

ఎల్‌‌‌‌నినో సందర్భంగా పునఃపరిశీలన ఆవశ్యకత

అక్టోబర్ 2026లో  తెలంగాణ  ప్రభుత్వం తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎల్‌‌‌‌నినో వల్ల కలిగే నష్టాలను  ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.  ప్రస్తుత కాలమానానికి అనుగుణంగా 'లిమిట్స్ టు గ్రోత్' సూత్రాలను ఉపయోగించి సాధారణ, మధ్యస్థ- ఒత్తిడి, తీవ్ర- ఒత్తిడి పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం అంచనా వేయాలి.  ముందస్తుగా తగిన కార్యప్రణాళిక రూపొందించాలి. 

వ్యవసాయ ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి, విద్యుత్ వినియోగం, ఉపాధి, ఆహార ధరలు, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావాలను అంచనా వేయాలి. ఈ ఫలితాలను పారదర్శకంగా ప్రచురించాలి. స్వతంత్రంగా సమీక్షించాలి.  ప్రజలందరికి తగిన స్థాయిలో అందుబాటులో ఉండే నీటి వనరులు, పారదర్శక కేటాయింపు నియమాలు, ప్రధాన నీటి ప్రాజెక్టుల స్వతంత్ర మూల్యాంకనం, ప్రభావిత వర్గాల అర్థవంతమైన భాగస్వామ్యం.  

నీళ్ల పెట్టుబడులను కేవలం నీటి పరిమాణం లేదా రిజర్వాయర్ సామర్థ్యం ఆధారంగానే కాకుండా, వాటి వలన ఒనగూరే దీర్ఘకాలిక ఆర్థిక రాబడులు,  పర్యావరణ పరిణామాలు, పంపిణీ  ప్రభావాలను కూడా అంచనా వేయాలి.  నీటి వినియోగంలో పెరుగుదల,  సహజ నీటి వ్యవస్థల క్షీణత, నీటి కాలుష్యం, వర్షపు నీరును ఆపుకోలేకపోవడం వంటివి కూడా పరిశీలించదగిన పరిణామాలే. అందువల్ల  భూగర్భ జలాల పునరుజ్జీవనం, మురుగునీటి పునర్వినియోగం, సమర్థవంతమైన నీటిపారుదల, స్థానికంగా అనువైన పంటల సరళి ఆర్థిక ప్రణాళికలో అంతర్భాగం కావాలి.

 నీరు ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతికి అవసరమైన వనరుగా తెలంగాణ గుర్తించాలి. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందగలదు అనేది మాత్రమే కాదు, ఆ అభివృద్ధిని నిలబెట్టే జల ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు, నష్టాలను ఎలా పంచుకోవాలి అనేది కూడా ప్రజా పాలనలో కీలక అంశంగా మారాలి.

ఆధునిక అభివృద్ధిలో దాగి ఉన్న పరిమితులు

వనరుల వినియోగం, పర్యావరణ ఒత్తిళ్లు, సుస్థిర పరిమితులను మించిన అభివృద్ధి ఆర్థిక విస్తరణలో  భౌతిక పరిమితులను ఎదుర్కోవచ్చని ‘ది లిమిట్స్ టు గ్రోత్’ నొక్కి చెబుతున్నది.  తెలంగాణకు వర్తింపజేస్తే ఈ దృక్పథం నీటి లభ్యతను ఒక గతిశీల ఆర్థిక నమూనాకు కేంద్ర బిందువుగా నిలుపుతుంది. 

ఆహారం,  గృహవసతి, శక్తి, పారిశ్రామిక ఉత్పత్తి, పట్టణ సేవలకు ఆర్థికవృద్ధి డిమాండ్‌‌‌‌ను పెంచుతుంది. ఈ కార్యకలాపాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నీరు అవసరం.  నిలకడలేని భూగర్భజల వెలికితీత, క్షీణిస్తున్న నీటి నాణ్యత లేదా అంతకంతకూ అనిశ్చితంగా మారుతున్న వర్షపాతం ద్వారా అదనపు డిమాండ్‌‌‌‌ను తీర్చినప్పుడు, ప్రస్తుత వృద్ధి భవిష్యత్ ఉత్పాదక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

 ఒక ఆర్థిక వ్యవస్థ ద్రవ్యపరంగా విస్తరిస్తూనే, తన భవిష్యత్ వృద్ధికి ఆధారమైన పర్యావరణ పునాదులను బలహీనపరచుకోవచ్చు. తెలంగాణకు మొత్తంగా తగినంత నీరు ఉందా లేదా అన్నది మాత్రమే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న కాదు. అవసరమైన ప్రదేశాలలో, సరైన సమయాలలో,  సుస్థిర పర్యావరణ పరిమితులకు లోబడి నీరు అందుబాటులో ఉందా లేదా అన్నదే కీలకం.

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్-​

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.