- మృతుల్లో టీచర్ కూడా..
పెషావర్: పాకిస్తాన్లోని పెషావర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ కూలి మహిళా టీచర్తోపాటు 34 మంది చిన్నారులు చనిపోయారు. గురువారం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్లోని దిర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 45 మంది చిన్నారులు గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకోవడంతో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల్లో 13 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉన్నారని లేడీ రీడింగ్ ఆసుపత్రి ప్రతినిధి ముహమ్మద్ అసిమ్ తెలిపారు.
చనిపోయిన వారిలో ఆరుగురు బాలికలు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. తమ పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు స్కూల్, ఆసుపత్రుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నాసిరకం మెటీరియల్ వాడటం వల్లే బిల్డింగ్ కూలిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి స్కూల్ ఓనర్ను అరెస్ట్ చేశారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ అఫాక్ వజీర్ ఆదేశించారు.
