భారతీయ సంస్కృతిలో స్త్రీని శక్తిగా విశ్వసించి పూజిస్తుండటం చూస్తున్నాం. ముఖ్యంగా పర్వదినాలు, పూజలలో బాలికలను సాక్షాత్తు పరాశక్తి (దుర్గాదేవి) రూపాలుగా భావించి పూజించడం భారతీయ సంప్రదాయంలో ఒక విశిష్టమైన ఆచారం. దసరా నవరాత్రుల కాలంలో అష్టమి, నవమి తిథులలో దేశవ్యాప్తంగా రెండేళ్ల నుంచి పదేళ్ల వయస్సు బాలికలకు ‘కన్యా పూజ’ లేదా 'కుమారి పూజ' ఘనంగా చేస్తారు.
స్వామి వివేకానందుడు కూడా ఈ పూజ ప్రాధాన్యతను వివరించారు. బాలికకు ఇవ్వాల్సిన ఉన్నతస్థానం గురించి శాస్త్రప్రకారం పూజలు చేయడం, అర్చించడం సంగతి అలా ఉంటే, నిత్య జీవితంలో మన బాలిక ఎక్కడుందనేది సమీక్ష చేసుకోవడం తక్షణావసరం.
బాలికల ఉన్నతి కోసం దశాబ్దాలుగా దేశంలోని ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నప్పటికీ.. ఒక బాలికకు నిజమైన పురోగతిని నిర్దేశించేది, నిర్ణయించేది కుటుంబ సభ్యులు, సమాజం మాత్రమే. తాజా అధ్యయనాలను గమనిస్తే.. పట్టణాలు, నగర బాలికల పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు విద్యలో గ్రామీణ బాలికల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి అని నివేదికలు తెలియజేస్తున్నాయి.
5వ తరగతి వరకూ బడికెళ్లే అమ్మాయిల శాతం బాగా పెరిగినప్పటికీ యుక్తవయస్సుకు వచ్చేకొద్దీ హైస్కూల్ స్థాయిలో చదువు మానేయడం (డ్రాపౌట్) 9.6 శాతం వరకూ ఉంటుందని ఏఎస్ఈఆర్ (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదిక వెల్లడించింది.
పాఠశాలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, మరుగుదొడ్ల కొరత, ఇంటిపని భారం, తోబుట్టువుల సంరక్షణ ఇందుకు కారణాలు. పట్టణాలు, నగర బాలికల విషయానికి వస్తే డిగ్రీ, ఐటీఐ లేదా పారామెడికల్ కోర్సుల్లో చేరుతున్న బాలికల సంఖ్య పెరిగింది. ఉపాధికి కోసం కమ్యూనికేషన్, కంప్యూటర్ నైపుణ్యం పెంచుకోవడంలో పట్టణ, నగర బాలికలు ముందంజలో ఉన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాలలో మాత్రం బాలికలు సమాన అవకాశాలు పొందుతూ వేగంగా దూసుకెళ్తున్నారు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ బాలికలు డిజిటల్ విద్యలో వెనుకబడి ఉన్నారు.
బాల్య వివాహాలతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమతులాహారం దొరక్కపోవడం వల్ల బాలికలు రక్తహీనత (అనిమియా), ఎదుగుదల లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. శానిటరీ ప్యాడ్ల వాడకంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, నేటికీ కొనసాగుతున్న సాంప్రదాయక పద్ధతుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మార్పు రావలసి ఉంది.
చట్టాలు ఎంత కఠినతరం చేసినప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో బాలికలకు చిన్న వయస్సులోనే బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 20-–24 ఏళ్ళ వయస్సు యువతుల్లో దాదాపు 27% మందికి 18 ఏళ్ల వయస్సు రాకుండానే పెళ్లి జరిగి వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గ్రామాల్లో 15–19 ఏళ్లున్న కౌమార బాలికలలో సుమారు 59.1% మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. 40% నుంచి 50% మంది పోషకాహార లోపానికి గురై తక్కువ బరువు ఉన్నారు. ఈ వయస్సులోనే సుమారు 6.8% మంది గ్రామీణ బాలికలు గర్భం దాల్చుతున్నారు. పెద్ద పట్టణాలు, నగరాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ క్లినిక్లు దగ్గర్లో, ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ప్రాథమిక వైద్యం అందుతోంది. కానీ, జంక్ ఫుడ్ సంస్కృతి పెరగడం వల్ల వీరికి హార్మోన్ల అసమతుల్యత (పీసీఓఎస్) వంటి కొత్త రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
బాలికల సంక్షేమంలో డెన్మార్క్దే అగ్రస్థానం
పాశ్చాత్య దేశాలలో చూస్తే ప్రధానంగా అమెరికా, కెనడాలలో పాఠశాల స్థాయి నుంచే బాలికలను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ రంగాల్లోకి ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వల్ల ఊబకాయం, సోషల్ మీడియా వల్ల ఆందోళన లాంటి ఆధునిక సమస్యలు, గన్ కల్చర్ భయాలకు ఈ దేశాల బాలికలు ఎక్కువగా గురవుతున్నారు.
అయితే అక్కడ బాలికల హక్కులకు చెప్పుకోదగిన రక్షణ ఉంది. ఆస్ట్రేలియా,- న్యూజిలాండ్ బాలికలు ప్రకృతికి దగ్గరగా, ఒత్తిడి లేని వాతావరణంలో పెరుగుతారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు ఉన్నాయి. పాఠశాల దశ నుంచే బాలికలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా ప్రత్యేక ప్రాజెక్టులు నిర్వహిస్తారు.
బాలికల రక్షణ, ఉచిత విద్య, సంక్షేమంలో ప్రపంచంలో డెన్మార్క్దే అగ్రస్థానం. లింగ సమానత్వంతో బాలికలకు మంచి అవకాశాలు కల్పించే అత్యుత్తమ దేశంగా ఐస్లాండ్ నిలిచింది. బాలికలకు నాణ్యమైన ఆహారం, వారి మానసిక ఆరోగ్యంపై నార్వే ప్రత్యేక దృష్టి సారించి కాపాడుతోంది. బాలికలపై ఎలాంటి సామాజిక రుగ్మతల ప్రభావం లేని దేశంగా స్వీడన్ పేరొందింది.
బాలికల స్వర్గధామంగా నిలిచిన మరో దేశం ఫిన్లాండ్. ఈ దేశాల్లోని బాలికలను సాహస క్రీడలవైపు ప్రోత్సహిస్తూ ధైర్య, సాహస స్ఫూర్తిని పెంపొందిస్తుంటారు. ఇక ఇస్లామిక్ దేశాలలో సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలలో బాలికల అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతుండగా, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి కొన్ని దేశాలలో బాలికల ప్రాథమిక హక్కులు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
కొన్ని ముస్లిం దేశాలలో బాలికలు దారుణ పేదరికం, కఠిన నియంత్రణలు, బాల్య వివాహాల బారిన పడి నలిగిపోతున్నారు. దేశవిదేశాల్లోని ఈ పరిణామాల మధ్య భారతీయ బాలికలకు మరింత ఊతమిచ్చి నిలబెట్టేలా చేయిచేయి కలుపుదాం.
సమస్యలను అధిగమించి అపూర్వ విజయాలు
మన బాలికలకు సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమించి అపూర్వమైన విజయాలు సాధిస్తున్నారు. చిన్న వ్యాపారాల నుంచి పారిశ్రామిక రంగం, ఐటీ రంగం, క్రీడలు, పోలీస్, సైన్యం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాలలో కోట్లాది మంది యువతులు, మహిళలు పురుషులకు దీటుగా భాగస్వామ్యం సంపాదించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. వీరంతా బాలికల దశలో ఉండగా పట్టుదలతో పెంచుకున్న సామర్థ్యాల వల్ల ఈ స్థాయికి చేరుకున్నారు.
ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ల నుంచి చట్టసభల సభ్యులుగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులుగా రాజకీయాలను శాసిస్తున్నారు. ఉద్యమాలు నడుపుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే గ్రామీణ బాలికలకు ఎక్కువ చేయుత అందించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.
బాలికలు ఇన్ని విజయాలు సాధిస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు మన సమాజంలో నేటికీ ఆడపిల్లను చిన్నచూపు చూడటం శోచనీయం. అమ్మాయి పుడితే తల తిప్పుకునే వ్యక్తులున్న కుటుంబాలున్నాయనేది వాస్తవం. ఆధునిక సమాజంలో ఇది అత్యంత బాధాకరం.
- గుళ్ళపూడి శ్రీనివాసకుమార్, సీనియర్ జర్నలిస్ట్-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
