- నేడు, రేపు ఢిల్లీలో నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీటి భద్రత దేశానికే ఆదర్శమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న సదస్సులో ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ వాటర్ సెక్యూరిటీ మోడల్’ను ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. నీటి భద్రత, సమర్థవంతమైన నీటి సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒక కార్యాచరణను రూపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్ లో సమీక్ష నిర్వహించారు.
“ఈ సదస్సులో నాలుగు అంశాలపైన చర్చిస్తారు. సకాలంలో ప్రాజెక్టుల పూర్తి, ‘క్యాచ్ ది రెయిన్' ప్రచారం, తాగునీటి వనరుల సుస్థిరత, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాలపై వివరిస్తాం. నీటి భద్రతా ప్రణాళిక, జియోట్యాగ్ చేసిన సమగ్ర ఆస్తుల రిజిస్టర్, ఒకే లీడ్ ఏజెన్సీ బాధ్యత, జవాబుదారీతనంతో కూడిన నిధుల కేటాయింపు, స్పష్టమైన ప్రయోజనం అనే పంచసూత్రాల ఆధారంగా తెలంగాణ విధానం రూపొందించాం. ప్రతి నీటి వనరుకు ఒక ప్రత్యేక ఐడీ, జియోట్యాగింగ్ లొకేషన్, నిధుల వివరాలు, పర్యవేక్షించే ఏజెన్సీ బాధ్యత ఉండాలి” అని పేర్కొన్నారు.
తెలంగాణలో ఉన్న దాదాపు 44 వేల చిన్న నీటిపారుదల వనరుల్లో ఇప్పటివరకు 28 వేల చెరువులను మ్యాపింగ్ చేసి, జియోట్యాగింగ్ పూర్తి చేసి పునరుద్ధరించినట్టు మంత్రి వెల్లడించారు. దీనివల్ల 25.7 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు 9.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి సంరక్షణ నిర్మాణాల సంఖ్య 5.61 లక్షల నుంచి 15.88 లక్షలకు పెరిగిందన్నారు. 2024లో నీటి సంరక్షణలో తెలంగాణ ‘బెస్ట్ స్టేట్’గా నిలవడమే కాకుండా, దేశంలోని టాప్-15 జిల్లాల్లో తెలంగాణ నుంచే 13 జిల్లాలు స్థానం దక్కించుకున్నాయని గుర్తుచేశారు.
