- ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి!
- ఏఐ వీడియో షేర్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్
- అది కామెడీ పోస్టు.. ఖర్గ్ నార్మల్‌గానే ఉంది: ఇరాన్
దుబాయి: ఇరాన్ కీలక చమురు కేంద్రం ఖర్గ్ ద్వీపం భారీ పేలుళ్లతో ధ్వంసమవుతున్నట్లు చూపించే ఓ వీడియోను యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలైన వేళ ట్రంప్ చేసిన ఈ పోస్ట్ కలకలం సృష్టించింది. వాస్తవానికి ఖర్గ్‌పై అమెరికా దాడి చేయలేదు. అమెరికా రక్షణశాఖ వర్గాలు కూడా ఈమేరకు క్లారిటీ ఇచ్చాయి.
ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ యుద్ధ విమానం ఆకాశంలో ఎగురుతుండగా.. కింద చమురు స్టోర్ చేసే ట్యాంకులు, ఆయిల్ ట్యాంకర్ వద్ద భారీ పేలుళ్లు జరిగిన్నట్టు కనిపిస్తున్నది. ‘‘ఖర్గ్ ద్వీపం తునాతునకలైంది’’ అనే అర్థం వచ్చేలా ట్రంప్ ఆ వీడియోకు కామెంట్రాశారు. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు ఏఐతో రూపొందించినవిగా పరిశీలనలో తేలింది. తాజా వైమానిక దాడులు ఖర్గ్‌పై కాకుండా లారక్ ద్వీపంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరాలపైనే జరిగాయని అమెరికా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇరాన్ ఎదురుదాడి..
ట్రంప్ పోస్టును ఇరాన్ కొట్టిపారేసింది. ఖర్గ్‌లో పరిస్థితి సాధారణంగానే ఉందని, ఆయిల్ ఉత్పత్తి కార్యకలాపాలు ఆగలేదని ఇరాన్ నేషనల్ ఆయిల్ కంపెనీ చీఫ్ హమీద్ బోవార్డ్ తెలిపారు. ట్రంప్ పోస్ట్‌ను ‘‘నవ్వు తెప్పించేది’’ అంటూ ఇరాన్ అధికార వర్గాలు అభివర్ణించారు. అయితే లారక్‌పై అమెరికా దాడి మాత్రం నిజంగానే జరిగింది. హార్మూజ్ జలసంధిలో మళ్లీ సముద్రపు మైన్లు వేయడానికి సిద్ధమవుతున్న ఇరాన్ బలగాలను అడ్డుకునేందుకే దాడి చేశామని అమెరికా తెలిపింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికి ప్రతిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది. ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ తెలిపింది. యూఏఈలోని అల్ మిన్హాద్ ఎయిర్‌బేస్ వద్ద అమెరికా సైనికులు టార్గెట్గా ఎటాక్ చేసినట్టు ఇరాన్ ప్రకటించింది.
