ట్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నౌకలో మంటలు..హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీ మైన్లను ఢీకొట్టిందని ఐఆర్జీసీ వివరణ

ట్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నౌకలో మంటలు..హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీ మైన్లను ఢీకొట్టిందని ఐఆర్జీసీ వివరణ
  • పర్మిషన్​లేని మార్గంలో వెళ్లడంతోనే ప్రమాదం
  • రూల్స్ కచ్చితంగా పాటించాలని నౌకలకు హెచ్చరిక

టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: హార్మూజ్​జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ సూపర్‌‌ట్యాంకర్‌‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో నౌక సముద్రంలో నిలిచిపోయింది. తాము నిషేధించిన మార్గంలో ఈ ట్యాంకర్ ప్రయాణించిందని, ఆ మార్గంలో గతంలో తాము అమర్చిన సీమైన్స్ ను తాకిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌‌ కోర్ (ఐఆర్‌‌జీసీ) వివరించింది. సీమైన్స్ కారణంగా పేలుడు సంభవించి ట్యాంకర్ కు నిప్పంటుకుందని తెలిపింది.

 హార్మూజ్‌‌ జలసంధికి దక్షిణంగా ఈ ఘటన జరిగినట్లు ఇరాన్‌‌ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్‌‌ నియంత్రణలోని ఉత్తర మార్గానికి బదులుగా దక్షిణ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించే ఇతర నౌకలకూ ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని హెచ్చరించింది. హార్మూజ్‌‌లో ప్రయాణించే అన్ని నౌకలు ఇరాన్‌‌ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే, ట్యాంకర్‌‌ పేరు సహా ఇతరత్రా వివరాలు కానీ, నౌకలోని సిబ్బంది పరిస్థితి ఏంటనే వివరాలు కానీ వెల్లడించలేదు.

చమురు రవాణాపై ప్రభావం

హార్మూజ్‌‌లో ఉద్రిక్తతలతో వాణిజ్య నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు మరింత వెనుకాడే అవకాశం ఉంది. సూపర్‌‌ ట్యాంకర్‌‌ సీ మైన్లను ఢీకొన్న ఘటన ఈ భయాలను పెంచింది. ఘటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌‌లో చమురు ధరలు కూడా పెరిగాయి. బ్రెంట్‌‌ క్రూడ్‌‌ ధర బ్యారెల్‌‌కు 90 డాలర్లకు పైగా చేరింది. హార్మూజ్‌‌లో నౌకల రాకపోకలు మరింత దెబ్బతింటే ప్రపంచ చమురు సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.