Success story: వీకెండ్‌ బిజినెస్ గా మొదలై.. రూ.565 కోట్ల టర్నోవర్ ..యువ ఇంజినీర్ల సూపర్ సక్సెస్

Success story: వీకెండ్‌ బిజినెస్ గా మొదలై.. రూ.565 కోట్ల టర్నోవర్ ..యువ ఇంజినీర్ల సూపర్ సక్సెస్

చాలా మంది తాము చదివిన రంగంలోనే కెరీర్‌ కొనసాగించాలని కోరుకుంటారు. కానీ ఈ ఇద్దరు యువ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఉద్యోగం కోసం వెతకడం కంటే.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి, పరిష్కారం చూపే వ్యాపారాన్ని నిర్మించాలనుకున్నారు. అట్ల మొదలైన వారి ఆలోచన.. తొలుత వీకెండ్‌ బిజినెస్‌గా ప్రారంభమై, ఇప్పుడు ఏకంగా రూ.565 కోట్ల టర్నోవర్‌ సాధించే స్థాయికి చేరింది. అంతేకాదు.. భారత్‌లో తొలి లైవ్‌స్టాక్‌ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, పశువుల కొనుగోలు, విక్రయాల్లో( ఆన్ లైన్ లైవ్ స్టాక్) సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు.  సక్సెస్ ఫుల్ లైవ్ స్టాక్ కంపెనీ యానిమాల్ వ్యవస్థాపకులు, ఢిల్లీ ఐఐటీ ఇంజనీర్లు నీతూ యాదవ్, కీర్తి జాంగ్రా సక్సెస్ స్టోరి. 

ఇంజినీరింగ్‌ చదివిన నీతూ యాదవ్‌, కీర్తి జాంగ్రా కలిసి స్థాపించిన యానిమాల్‌.. రైతుల అవసరాలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ సక్సెస్ ఫుల్ అగ్రిటెక్‌ వెంచర్‌గా ఎదిగింది. చదువుతో సంబంధంలో లేకుండా భిన్నమైన రంగంలోకి అడుగుపెట్టి, వినూత్న ఆలోచనతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్మించిన ఈ ఇద్దరు యువ పారిశ్రామికవేత్తల ప్రయాణం ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇద్దరూ ఐఐటీ ఢిల్లీలో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. 2016లో చదువు పూర్తయ్యాక కార్పొరేట్ ఉద్యోగాల్లో చేరారు. అయితే సొంతంగా ఏదైనా చేయాలనేది వారి ఆలోచన. అనుకున్నదే ఆలస్యం 2019లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టారు. పశువుల కొనుగోలు, అమ్మకాలు ఎక్కువగా స్థానిక వ్యాపారులు, దళారులు, పరిచయాలపైనే సాగుతుండటంతో రైతులు మోసాలకు గురవుతున్నారని గుర్తించారు. సరైన కొనుగోలుదారులను కనుగొనడం, సరైన ధర పొందడం రైతులకు కష్టంగా ఉందని తెలుసుకున్నారు. 

రైతు సమస్యల  పరిష్కారంకోసం ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, టెక్నికల్ నిపుణులతో చర్చించి తొలుత వీకెండ్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. వందలాది మంది రైతులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం 2019లో యానిమల్ పేరుతో ఆన్‌లైన్ పశువుల మార్కెట్‌ను ప్రారంభించారు. రైతులు పశువుల అమ్మకాలు, కొనుగోలుదారులు తమకు అవసరమైన పశువులను వెతుక్కోవడంలో ఈ ప్లాట్‌ఫామ్ కీలకంగా మారింది.

యానిమల్ సేవలు పశువుల కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాలేదు. పశువుల ఆరోగ్యం, కృత్రిమ గర్భధారణ, పశువుల గ్రేడింగ్, బీమా, ఆర్థిక సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 నాటి నివేదిక ప్రకారం ప్లాట్‌ఫామ్‌లో 1.8 లక్షలకు పైగా పశువులు నమోదయ్యాయి.

బీనెక్స్ట్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, ఓమ్నివోర్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ వంటి ప్రముఖ సంస్థల నుంచి యానిమల్ పెట్టుబడులు అందుకుంది. 2022లో ఫోర్బ్స్ ఇండియా  30లో  అండర్ 30 జాబితాలో నీతూ యాదవ్, కీర్తి జాంగ్రాలకు స్థానం లభించింది. చిన్న వీకెండ్ ప్రాజెక్ట్‌గా మొదలైన యానిమల్.. నేడు సుమారు రూ.565 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది.