- శివసేన కార్పొరేటర్ కేసులో సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: హాస్పిటల్లోకి వెళ్లి ఎవరినైనా సరే కొడతావా... డాక్టర్లపై దాడి చేస్తే ఊరుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. థానే జిల్లాలోని మున్సిపల్ ఆస్పత్రిలో వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ రమేశ్ మహాత్రే.. తనపై బాంబే హైకోర్టు విధించిన బెయిల్ షరతులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ‘‘ఒక మూక దాడి చేసినప్పుడు వైద్యులు పడే మానసిక క్షోభను ఊహించండి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మహాత్రే తరఫున సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. విచారణ ప్రారంభమయ్యే వరకు గోవాలో నివసించాలన్న, వారానికి మూడుసార్లు పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలన్న బాంబే హైకోర్టు షరతులు కఠినంగా ఉన్నాయని తెలిపారు. అయితే డాక్టర్ల నిరసనల నేపథ్యంలో హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకోవడం సమర్థనీయమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది మాట్లాడుతూ నిందితుడి బెయిల్‌ను సవాల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐఎంఏ కూడా బెయిల్‌ను వ్యతిరేకించింది. ప్రభుత్వం దాఖలు చేయనున్న బెయిల్ రద్దు పిటిషన్ కోసం వేచి చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
