ఢిల్లీలో రూ.35కే కేజీ ఉల్లి ..దేశ రాజధానికి 1000 మెట్రిక్ టన్నులు కేటాయించిన కేంద్రం 

ఢిల్లీలో రూ.35కే కేజీ ఉల్లి ..దేశ రాజధానికి 1000 మెట్రిక్ టన్నులు కేటాయించిన కేంద్రం 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు భారీ ఊరటనిచ్చాయి. ఢిల్లీలోని ప్రజలకు అందుబాటు ధరలో ఉల్లిని అందించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కిలో ఉల్లిని కేవలం రూ.35 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఉల్లి కొరత తలెత్తకుండా, సామాన్యులపై ధరల భారం పడకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 1,000 మెట్రిక్ టన్నుల ఉల్లిని కేటాయించింది. ఈ సబ్సిడీ ఉల్లిని ఢిల్లీలోని ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా కిలో రూ.35 చొప్పున పంపిణీ చేయనున్నారు.

అలాగే, చౌక ధరల దుకాణాలకు దూరంగా ఉండే ప్రాంతాల ప్రజల కోసం ఢిల్లీలోని మొత్తం 13 జిల్లాల్లో ప్రత్యేక మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో తిరిగే ఈ వ్యాన్ల ద్వారా కూడా ప్రజలు సబ్సిడీ ఉల్లిని కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. ఢిల్లీలో నిత్యావసర వస్తువుల ధరలు, లభ్యతను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లి కొరత రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది.