పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాలలో మాయమాటలు చెప్పి రూ.2.50 కోట్లు వసూలు చేసి ఓ వ్యాపారి ఉడాయించాడు. తమ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యాపారి పరారవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతమ్, ప్రవళిక దంపతులు 2022లో చిత్రియాల గ్రామ శివారులోని ఏనె చౌరస్తాలో కిరాణా షాపు ఏర్పాటు చేసుకున్నారు.
గ్రామస్తులతో కలుపుగోలుగా ఉంటూ ఇల్లు కట్టుకునేందుకు జాగ తీసుకున్నామని, పెట్టుబడికి, ఇంటి పనులకు డబ్బులు అర్జెంట్ గా అవసరం అని చెప్పి గ్రామస్తుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇలా 80 మంది వద్ద రూ.2.50 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించారు. దంపతులు పరారవడంతో తాము మోసపోయామని గ్రహించి బాధితులు పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
