మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 24 గంటల్లోనే దొంగను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి నుంచి దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రెండు బైక్లు, రెండు గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు. నిందితుడిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తుప్రాన్ సీఐ వెంకట్ రాజ గౌడ్ మంగళవారం (సెప్టెంబర్ 1) మీడియాకు వెల్లడించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణoలో ఆదివారం (ఆగస్ట్ 31) అర్ధరాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి చొరబడి బయట దండెంపై ఆరబెట్టిన దుస్తులు, వంట సామాగ్రి చోరీ చేశాడు. అలాగే, ఒక పోలీస్ ఇంట్లో చొరబడి స్కూటీని సైతం ఎత్తుకెళ్లాడు. దొంగ ఓ ఇంట్లో బట్టలు చోరీ చేస్తుండగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
చోరీ మొత్తం ఒక ఎత్తయితే.. పోలీస్ ఇంట్లో దొంగతనం చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగ చేసిన పనికి పట్టణవాసులు ఆశ్చర్య పోతున్నారు. పోలీసుల ఇంటికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.
