కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత లగేజి సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. లగేజి వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతతో మార్పులు తీసుకురానుంది టీటీడీ. ఇందుకు సంబందించిన ఏర్పాట్లపై జీఎంఆర్ సంస్థతో మంగళవారం ( సెప్టెంబర్ 1 )సమీక్షా సమావేశం నిర్వహించారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.
ఈ సందర్భంగా జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు నూతన విధానం గురించి అదనపు ఈవోకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆధునిక BLE 5.1 సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించిన ఈ విధానంలో భక్తుల లగేజీని స్వీకరించినప్పటి నుంచి తిరిగి అందజేసే వరకు ప్రతి దశను సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించే విధానాన్ని వివరించారు జీఎంఆర్ ప్రతినిధులు.ఈ విధానం ద్వారా అలిపిరి దగ్గర భక్తుల లగేజీని స్వీకరించడం, ట్యాగ్‌ను అనుసంధానం చేయడం, వాహనాల ద్వారా తిరుమలకు తరలించడం, జీఎన్‌సీ దగ్గర లగేజీని నిల్వ చేయడం, భక్తులు లగేజీని తిరిగి తీసుకునే వరకు మొత్తం ప్రక్రియను ఎండ్-టు-ఎండ్ ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
రోజుకు సుమారు 12 వేల బ్యాగులను, రద్దీ సమయాల్లో గంటకు సుమారు 18 వందల బ్యాగులను నిర్వహించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి లగేజీకి BLE ట్యాగ్‌ను అనుసంధానం చేయడం ద్వారా అది ఏ ప్రాంతంలో ఉందో నిరంతరం గుర్తించే విధానం, భక్తులు లగేజీని తిరిగి పొందే సమయంలో క్యూలను తగ్గించేందుకు ముందస్తు రిక్వెస్ట్ చేసే విధానాన్ని జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు.
►ALSO READ | అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు.. సెప్టెంబర్ 8 నుంచి..
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన లగేజీ నిర్వహణ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడంతో పాటు లగేజీ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
