వెయ్యిరోజుల పాలన కాదు.. ప్రజావంచన..రైతులు, నిరుద్యోగులకు ద్రోహం.. మహిళలకు నిరాశ : ఎన్.రాంచందర్ రావు

వెయ్యిరోజుల పాలన కాదు.. ప్రజావంచన..రైతులు, నిరుద్యోగులకు ద్రోహం.. మహిళలకు నిరాశ : ఎన్.రాంచందర్ రావు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఫైర్‌‌‌‌
  • హైడ్రా, హిల్ట్, క్యూర్ పేర్లతో నగర ప్రజలపై భారం
  • వెయ్యిరోజులైనా హామీలు అమలు కాలేదని ఆరోపణ
  • నల్గొండకు పోకుండా రాంచందర్‌‌‌‌రావు అడ్డగింత.. అరెస్ట్ 

హైదరాబాద్, న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌.రాంచందర్‌‌‌‌రావు పేర్కొన్నారు. , దానిని ప్రజా పాలన పేరుతో ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో దయనీయమైన స్థితి ఉన్నదని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు చెప్పింది వెయ్యి అబద్ధాలు మాత్రమేనని, ఇది ప్రజా పాలన కాదని.. ముమ్మాటికీ ప్రజా వంచన పాలన అని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన వందలాది హామీలను గాలికొదిలేసి, ప్రజలను నిత్యం మోసం చేస్తున్నారని అన్నారు.

మంగళవారం నల్గొండ జిల్లా అధ్యక్షుడిని పరామర్శించేందుకు వెళ్లేందుకు రెడీ అయిన రాంచందర్‌‌‌‌ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌‌ అరెస్టు చేశారు. తాను ఎలాగైనా వెళ్తానంటూ బయటకు రావడంతో రాంచందర్‌‌‌‌రావును పోలీసులు అరెస్టు చేసి, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా రాంచందర్‌‌‌‌రావు మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు రైతులకు అనేక  హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

రుణమాఫీ పూర్తి చేయడానికి రూ.40 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు ఎత్తేశారన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. మొదటి 100 రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలిస్తామని చెప్పి, స్వయంగా సర్కారు లెక్కల ప్రకారమే కేవలం 16 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతకు ద్రోహం చేశారని ఫైర్‌‌‌‌ అయ్యారు. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు ఏమైందని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, రైతు డిక్లరేషన్ల పేరుతో కొండంత ఆశలు చూపి ఇప్పుడు వాటిని గాలికొదిలేశారని పేర్కొన్నారు. 

ఇదేనా మీ పాలనా విధానం?

‘‘హైదరాబాద్ ప్రజలను భయపెట్టడానికి హైడ్రా, అస్థిరపరచడానికి హిల్ట్, వసూలు చేసుకోవడానికి క్యూర్.. ఇదేనా మీ పాలనా విధానం? ” అని రాంచంద్‌‌రావు ప్రశ్నించారు. పేదలకు రేషన్ బియ్యాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే ఇస్తోందని, ఆ వాస్తవాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని అడిగారు. బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని, గత ప్రభుత్వం చేసిన తప్పులనే వీరు మరో రూపంలో కొనసాగిస్తూ రిటైల్‌‌గా కాకపోయినా హోల్‌‌సేల్‌‌గా దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.

బీజేపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తున్నదని మండిపడ్డారు. ‘నల్లగొండలో బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గం.

బాధితులను పరామర్శించేందుకు వెళ్తే హౌజ్ అరెస్ట్ చేస్తారా? ప్రజలను కలవకుండా అడ్డుకుంటారా? ఇదేనా కాంగ్రెస్ చెప్పే ప్రజాస్వామ్యం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రాహుల్ గాంధీ రెండు నాల్కల ధోరణి?’ అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతులను అణిచివేయడానికి పోలీసులను ఉపయోగిస్తున్నదని ఆరోపించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయమేనని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల తరఫున బీజేపీ ప్రశ్నిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు.
బీజేపీ నేతల ఇండ్లపై దాడికి యత్నం.. 

నితిన్ నబీన్ సీరియస్  

బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై దాడికి ప్రయత్నించడం, ఆయన్ను నల్గొండ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.