షెన్‌జెన్: ఇండియా షట్లర్ ఉన్నతి హుడా.. చైనా మాస్టర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో నిరాశపర్చింది. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లోనే ఉన్నతి 10–21, 18–21తో వరల్డ్ 12వ ర్యాంకర్ కిమ్ గా యున్ (కొరియా) చేతిలో ఓడింది. 37 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ తొలి గేమ్‌లో పూర్తిగా తడబడింది. ఏ దశలోనూ ప్రత్యర్థి స్కోరును సమం చేయలేకపోయింది.
అయితే రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడి గట్టి పోటీ ఇచ్చింది. ఫలితంగా 18–18తో స్కోరు సమం చేసి రేసులో నిలిచింది. కానీ చివర్లో కిమ్ వరుసగా నెట్ పాయింట్లు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో హరిహరన్–అర్జున్ ఫిట్‌నెస్ సమస్య కారణంగా రిటైర్డ్ అయ్యారు. చెన్ బో యాంగ్–లియు యి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో 8–11 స్కోరు వద్ద ఇండియన్ ద్వయం మ్యాచ్ నుంచి వైదొలగడంతో ప్రత్యర్థులకు వాకోవర్ లభించింది.
