ఒకటి కంటే ఎక్కువ EMIలు, క్రెడిట్ కార్డు బిల్లులతో సతమతమవుతున్నవారికి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులువైన, ప్రయోజనకరమైన మార్గాలు ఉన్నాయి. సరైన ప్లానింగ్ లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ లోన్ పేమెంట్స్ ఎలా నిర్వహించి, క్రెడిట్ స్కోర్‌ను ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చూద్దాం.
మొదటిగా.. మీ దగ్గర ఉన్న అన్ని ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులను లెక్కగట్టాలి. మీ మొత్తం నెలవారీ లోన్ చెల్లింపులు సంపాదనలో 40 నుంచి 50 శాతానికి మించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ అంతకంటే ఎక్కువైతే వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలి.
అలాగే అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న లోన్స్ చెల్లింపులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ కంటే పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర అదనపు నగదు ఉన్నట్లయితే.. ఈ ఖరీదైన అప్పులను ముందుగా తీర్చివేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించి కేవలం మినిమం డ్యూ మాత్రమే చెల్లించడం వల్ల వడ్డీ విపరీతంగా పేరుకుపోతుంది. కాబట్టి కనీస మొత్తం కంటే ఎక్కువే చెల్లించడానికి ప్రయత్నించాలి. వీలైతే అనేక లోన్స్ తక్కువ వడ్డీ ఉన్న ఒకే లోన్‌గా మార్చుకోవడం(Debt Consolidation) ద్వారా చెల్లింపులను సులభతరం చేసుకోవచ్చు.
ALSO READ : స్టాక్ మార్కెట్ వ్యసనం: రోజూ 16 గంటలు ట్రేడింగ్..
క్రెడిట్ స్కోర్ కాపాడుకోవడంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఒక్క ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైనా అది మీ సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించడానికి ఆటో-డెబిట్ ఆప్షన్‌ను సెట్ చేసుకోవడంతో పాటు, అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.
ఊహించని ఖర్చులైనా ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ఫండ్ ఎంతో అవసరం. కనీసం 3 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా పక్కన ఉంచుకోవాలి. దీనివల్ల వైద్య అత్యవసరాలు, జాబ్ కోల్పోవటం వంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కొత్త అప్పులు చేయాల్సిన అవసరం రాదు.
