నేపాల్ వరదల్లో నిలిచిన గ్రీన్ హౌస్.. చుట్టూ ఉన్న ఇళ్లు కొట్టుకుపోయినా ఈ బిల్డింగ్ ఎలా తట్టుకుందంటే ?

నేపాల్ వరదల్లో నిలిచిన గ్రీన్ హౌస్.. చుట్టూ ఉన్న ఇళ్లు కొట్టుకుపోయినా ఈ బిల్డింగ్ ఎలా తట్టుకుందంటే ?

నేపాల్‌లో కొద్దిరోజుల క్రితం వచ్చిన భారీ  వరదలు ఆ ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేశాయి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లులు, వాహనాలు, భవనాలు అన్నీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కానీ, ఇన్ని విధ్వంసాల మధ్య ఒకే ఒక్క ఆకుపచ్చ రంగు ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఇల్లే నేపాల్‌లోని నువాకోట్ జిల్లాకు చెందిన ప్రకాష్‌ది. ఈ అద్భుతమైన ఘటనకు సంబంధించిన వివరాలు 'ది లల్లన్‌టాప్' ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చాయి.

ఆగస్టు 26న నేపాల్‌లో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామాలకు గ్రామాలు వరద నీటిలో  మునిగాయి. ఆ సమయంలో ప్రకాష్ తన ఇంటికి దగ్గరలో  ఉన్న షాపులో ఉన్నారు. వరదనీటి  ప్రవాహం పెరుగుతుందనే హెచ్చరిక అందగానే ఆయన వెంటనే తన ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఇంట్లోని కుటుంబ సభ్యులను గట్టిగా అరిచి అలర్ట్ చేశారు.

అయితే ప్రకాష్ ఇంటికి చేరుకునేసరికే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ దారిలో అడ్డుగా ఉన్న ప్రతీదాన్నీ కొట్టుకెళ్లడం మొదలుపెట్టింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రకాష్‌తో పాటు కుటుంబ సభ్యులు అందరూ భయంతో వణికిపోయారు. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో ఆ కుటుంబం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మొదట పై అంతస్తుకు, ఆ తర్వాత పరిస్థితి మరింత క్షీణించడంతో భవనంలో మొత్తం పై అంతస్తు మీదకు చేరుకున్నారు.

ఈ హడావుడిలో ప్రకాష్‌ను తీవ్రంగా వేధించిన మరో ఆందోళన తన చిన్న కొడుకు గురించి. మిగతా కుటుంబ సభ్యులందరూ పక్కనే ఉన్నప్పటికీ, స్కూల్‌కి వెళ్లిన తన కొడుకు మాత్రం అక్కడ లేకపోవడంతో ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. "మాకు ఏమైనా పర్వాలేదు కానీ, మా వాడి పరిస్థితి ఏంటని ఆ ఆలోచనే నన్ను నిరంతరం కుంగదీసింది" అని ప్రకాష్ ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు.

మరి ఇన్ని ఇళ్లు కొట్టుకుపోయినా ప్రకాష్ ఇల్లు మాత్రం ఎలా నిలబడింది ? దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఆ ఇల్లు సుమారు 40 ఏళ్ల క్రితం కట్టింది. ఆ కాలంలో సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి నాణ్యత చాలా బాగుండేది. అంతేకాకుండా, ఆ ఇల్లు నదికి దగ్గరగా ఉండటంతో పునాదిని చాలా పటిష్టంగా నిర్మించారు. భద్రతా చర్యల్లో భాగంగా పునాది కింద రెండు మూడు పొరల రోడ్డు మెటీరియల్‌ను వేయడం వల్ల దానికి అద్భుతమైన బలం వచ్చిందని ప్రకాష్ తెలిపారు.

ఇల్లు కూలిపోకుండా నిలబడినప్పటికీ, కింది అంతస్తులన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. షాపులోని సరుకులు, ఇంట్లోని సామాను, వాహనాలు అన్నీ వరద నీటిపాలయ్యాయి. దింతో ఆ కుటుంబం సుమారు గంట నుంచి గంటన్నర పాటు పైకప్పు మీద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఆ తర్వాత స్థానికులు అక్కడికి చేరుకుని, భవనాల మధ్య  తాడు సహాయంతో అవతలి వైపు నుంచి వారిని సురక్షితంగా కాపాడారు.

ప్రస్తుతం ప్రకాష్ కుటుంబం ఈ పెను నష్టాన్ని దిగమింగుకుని కాఠ్మండులో ఉంటోంది. అక్కడ ఉన్నదంతా పోయినా, ప్రాణాలతో బయటపడటమే తమకు పెద్ద విషయమని వారు భావిస్తున్నారు. "అక్కడ ఉన్నదంతా నాశనమైపోయింది, బురదలో కూరుకుపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి అన్నీ నిర్మించుకోవాలి" అన్ని  ప్రకాష్ అన్నారు. ప్రకృతి ఎంత కోపగించుకున్నా, మనుషుల ప్రాణాలను నిలబెట్టిన ఆ పచ్చని ఇల్లు మాత్రం ఇప్పుడు ఆ కుటుంబ పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.