న్యూఢిల్లీ: ఢిల్లీలో 2026, సెప్టెంబర్ 5న పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. జులై 20 జంతర్ మంతర్ ఆందోళనకు సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడంతో పాటు నిరసనకారులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు హామీ ఇవ్వడంతో సీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు ఈ మేరకు సుప్రీం కోర్టుకు తెలిపింది. సీజేపీ నిర్ణయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్వాగతించింది.
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదంపై గతంలో సీజేపీ జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు సుదీర్ఘ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూలై 20న సీజేపీ చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే జూలై 25న కేంద్ర ప్రభుత్వం, సీజేపీ మధ్య చర్చలు జరిగాయి. నిరసనకారులపై కేసులను ఎత్తివేయడంతో పాటు సీజేపీ ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సీజేపీ ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆ హామీలను కేంద్రం అమలు చేయట్లేదని సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హామీల అమలుకు కేంద్రంపై మరోసారి ఒత్తిడి పెంచేందుకు 2026, సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర సీజేపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
అయితే, సీజేపీ నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై మంగళవారం (సెప్టెంబర్ 1) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జులై 20 జంతర్ మంతర్ ఆందోళనకు సంబంధించి నిరసనకారులపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడంతో పాటు నిరసనకారులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది.
ALSO READ : ఇంటర్ అర్హతతో ONGCలో జాబ్స్..
కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఇచ్చిన సానుకూల హామీల నేపథ్యంలో తాము సెప్టెంబర్ 5న నిర్వహించాలనుకున్న నిరసన మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ సుప్రీంకోర్టు సమక్షంలో ప్రకటించారు. సీజేపీ నిర్ణయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్వాగతించారు. ఇరుపక్షాలు సఖ్యతగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు పరిష్కరించవచ్చని అన్నారు.
