సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. NEET లీక్ నిరసనకారులపై కేసులన్నీ రద్దు

సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. NEET లీక్ నిరసనకారులపై కేసులన్నీ రద్దు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను మంగళవారం (సెప్టెంబర్ 1) కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న అధికారాలను ఉపయోగించి యువత భవిష్యత్ దెబ్బతినకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, కేవలం నిరసనల్లో పాల్గొన్న సాధారణ విద్యార్థులకు మాత్రమే నిబంధన వర్తిస్తుందని.. హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి ఈ రద్దు వర్తించదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదంపై గతంలో సీజేపీ జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు సుదీర్ఘ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూలై 20న సీజేపీ చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఈ క్రమంలోనే జూలై 25న కేంద్ర ప్రభుత్వం, సీజేపీ మధ్య చర్చలు జరిగాయి. నిరసనకారులపై కేసులను ఎత్తివేయడంతో పాటు సీజేపీ ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సీజేపీ ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్‎లను క్వాష్ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. జులై 20 జంతర్ మంతర్ ఆందోళనకు సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడంతో పాటు నిరసనకారులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. 

►ALSO READ | సెప్టెంబర్ 5న ఢిల్లీలో CJP మార్చ్‌ రద్దు.. కేంద్రం హామీతో మనసు మార్చుకున్న కాక్రోచ్ పార్టీ

ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం (సెప్టెంబర్ 1) కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న అధికారాలను ఉపయోగించి యువత భవిష్యత్ దెబ్బతినకుండా కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, సాధారణ విద్యార్థులకు మాత్రమే ఈ ఉపశమనం లభిస్తుందని.. క్రిమినల్ రికార్డులు ఉన్న వారిపై కేసులు నమోదు చేసేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టు నిర్ణయంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.