టైమ్స్ స్క్వేర్ కాల్పులు.. కత్తితో దాడి చేసిన మహిళను కాల్చి చంపిన న్యూయార్క్ పోలీసులు!

టైమ్స్ స్క్వేర్ కాల్పులు.. కత్తితో దాడి చేసిన మహిళను కాల్చి చంపిన న్యూయార్క్ పోలీసులు!

అమెరికా న్యూయార్క్ నగరంలోని రద్దీ ప్రాంతమైన టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన ఒక హింసాత్మక ఘటన జనాన్ని భయాందోళనలకు గురిచేసింది. 49 ఏళ్ల పమేలా సిస్నెరోస్ అనే మహిళ ఇద్దరిపై కత్తితో దాడి చేసింది. ఈ అకస్మాత్తు దాడిలో 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల వృద్ధుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. 

కత్తులతో బెదిరింపులు.. 
నిందితురాలు పమేలా సిస్నెరోస్ 2 కత్తులతో నేరుగా టైమ్స్ స్క్వేర్‌లోని పోలీసు సబ్‌స్టేషన్ వైపు దూసుకువెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకున్నారు. కత్తులు కిందపడేయాలని 4 నిమిషాల పాటు పదేపదే హెచ్చరించారు. అయితే ఆమె పోలీసుల హెచ్చరలను పట్టించుకోకుండా.. వారిని చంపేస్తానని బెదిరింపులకు దిగింది.

పోలీసులు ఆమెను నిలువరించేందుకు మొదట తక్కువ ప్రాణాంతకమైన 'టెసర్' గన్లను ఉపయోగించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా కత్తులతో పోలీసుల మీదికే దూసుకెళ్లింది. దీంతో చేసేది లేక ఆత్మరక్షణ కోసం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు తమ సర్వీస్ వెపన్స్‌తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

►ALSO READ | చైనా, రష్యాకు బిగ్ షాక్.. 6 వెనిజువెలా చమురు క్షేత్రాలను లాక్కున్న అమెరికా!

ఈ ఘటనపై పలు విమర్శలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భౌతికంగా ఆమెను ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే న్యూయార్క్ చట్టాల ప్రకారం.. ప్రాణాంతక ముప్పు ఉన్నప్పుడు పోలీసులు ప్రత్యామ్నాయ క్రమపద్ధతిలో వెళ్లాల్సిన అవసరం లేదు.  ప్రమాదాన్ని బట్టి తక్షణ నిర్ణయం తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది.

నిజానిజాలు తేల్చనున్న బాడీ కెమెరా ఫుటేజ్
ఈ ఘటనపై ప్రస్తుతం అంతర్గత దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల స్పందనను ఎన్‌వైపీడీ కమిషనర్ జెస్సికా టిష్ సమర్థించారు. ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి రావడానికి, దూరం, సమయం, అధికారుల వ్యూహాలను అంచనా వేయడానికి బాడీ-కెమెరా ఫుటేజ్ కీలక ఆధారంగా మారనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక రికార్డులను విడుదల చేయనున్నారు.