రూ.20 లక్షలు శాలరీ హైక్ రిజెక్ట్ చేసిన బెంగళూరు టెక్కీ.. ఎందుకో తెలిస్తే షాకే!

రూ.20 లక్షలు శాలరీ హైక్ రిజెక్ట్ చేసిన బెంగళూరు టెక్కీ.. ఎందుకో తెలిస్తే షాకే!

ఎవరైనా జీతం పెంచుతాం, శాలరీ హైక్ చేస్తాం అంటే ఎగిరి గంతేస్తారు. కానీ నాకు మీ శాలరీ హైక్స్ వద్దురా మెుర్రో అంటూ తిరస్కరించే ఉద్యోగిని ఎప్పుడైనా చూశారా? కనీసం అలాంటిది ఎప్పుడైనా విన్నారా?. ఇది వింటే డబ్బులు ఏమైనా తీసుకోవటం చేదా నాకు ఆఫర్ వస్తే ఎంత బాగుండో అనుకునే వాళ్లు ఎంత మందో. అయితే ఈ టెక్కీ క్రేజీ స్టోరీ వింటే మీరు కూడా షాక్ అయిపోతారండి బాబు..

జీతం భారీగా పెరుగుతుందన్నా వద్దంటూ తిరస్కరిస్తున్న ఒక యువ టెక్కీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ రోజుల్లో కాస్త ఎక్కువ జీతం వస్తే చాలు ఉద్యోగాలు మారుతున్న వేళ రూ.20 లక్షల పెంపును ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడు తిరస్కరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవును బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్‌వర్క్ డెవలపర్ ప్రస్తుతం రూ.45 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. ఇటీవల అతనికి ఏకంగా రూ.20 లక్షల భారీ పెంపుతో కూడిన మరో ఆఫర్ వచ్చింది. దీంతో అతని మొత్తం జీతం రూ.65 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. కానీ ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. కొడుకు నిర్ణయం తెలుసుకున్న తండ్రి కూడా మెుదట షాక్ అయ్యాడు. "రూ. 20 లక్షలు ఎక్స్‌ట్రా ఇస్తామంటే.. సమస్య ఏమిటి?" అంటూ ఆశ్చర్యపోయారు.

అయితే ఆ జీతం పెంపు వెనుక దాగున్న కనిపించని భారమే ఆ టెక్కీ తీసుకున్న నిర్ణయానికి కారణంగా తేలింది. ఆ ఆఫర్‌ను అంగీకరిస్తే అమెరికా క్లయింట్‌లతో వారానికి 4 సార్లు లేట్ నైట్ మీటింగ్స్ అటెండ్ కావాలి. అంతేకాకుండా పెద్ద టీమ్స్ లీడ్ చేయడం, తరచూ ప్రయాణాలు చేయడం, వారాంతాల్లోనూ పనిచేయాల్సి వస్తుందట. దీనివల్ల వ్యక్తిగత జీవితం పూర్తిగా గందరగోళంగా మారుతుందని, వర్క్ లైఫ్ తన పర్సనల్ లైఫ్ ని పాడుచేస్తుందని చెప్పాడు సదరు టెక్కీ.

►ALSO READ | స్టాక్ మార్కెట్ వ్యసనం: రోజూ 16 గంటలు ట్రేడింగ్.. రూ.2 కోట్లు నష్టపోయిన టెక్కీ

వచ్చే ఏడాది భార్యాభర్తలు పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సమయంలో అదనపు బాధ్యతలు కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తాయని టెక్కీ గ్రహించాడు. వారంలో 5 రోజులు ఉదయం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రతి బుధవారం తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేయడం వంటి తన చిన్నపాటి ఆనందాలను కోల్పోవడానికి తాను సిద్ధపడలేనని తేల్చి చెప్పాశాడు యువ టెక్కీ. డబ్బే సర్వస్వమని భావించకుండా మానసిక ప్రశాంతతే ముఖ్యమని చిన్న వయస్సులోనే గుర్తించటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒక నిర్దిష్ట స్థాయి జీతం దాటిన తర్వాత వచ్చే అదనపు మొత్తం కంపెనీ జేబు నుంచి కాకుండా ఉద్యోగి వ్యక్తిగత సమయం, ఆరోగ్యం నుంచే చెల్లించాల్సి వస్తుందని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఆఫర్ లెటర్ ఎంత ఇస్తామనేది చెబుతుంది కానీ, మనం దానికి బదులుగా ఏది కోల్పోతున్నామో చెప్పదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. డబ్బు కంటే వ్యక్తిగత సమయం, కుటుంబంతో గడిపే క్షణాలే మిన్న అని నిరూపించిన ఈ టెక్కీ నిర్ణయం కార్పొరేట్ ఉద్యోగులకు కొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది.