ఉరి వేసుకుని మమతా బెనర్జీ మేన కోడలు ఆత్మహత్య

ఉరి వేసుకుని మమతా బెనర్జీ మేన కోడలు ఆత్మహత్య

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మమతా బెనర్జీ మేన కోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) ఆత్మహత్యకు పాల్పడింది. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలోని తన నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. కాగా,  గత కొంతకాలంగా బ్రిస్టీ డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. డిప్రెషన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లిగారింటి దగ్గరే ఉంటున్న బ్రిస్టీ భర్తతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.

ప్రస్తుతం న్యాయస్థానంలో విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. బెంగాల్‏లో పాఠశాల నియామకాల కేసుకు సంబంధించి బ్రిస్టీ ముఖర్జీ అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగం పొందారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. నియామక ప్రక్రియలో అవకతవకల కారణంగా బెంగాల్‎లోని ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ఆమె ఉద్యోగం కోల్పోయారు. మేన కోడలు మృతిపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

►ALSO READ | సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. NEET లీక్ నిరసనకారులపై కేసులన్నీ రద్దు

మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రాంపూర్‌హాట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలోని ఆమె ఇంటి రెండో అంతస్తులో బ్రిస్టీ ముఖర్జీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పోస్ట్‌మార్టం, ఇతర విచారణ అనంతరం మరణానికి దారితీసిన పరిస్థితులు తెలుస్తాయన్నారు.