న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో సింధూ నది జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూ నది జలాలను పాక్‌కు జీవనాధారంగా అభివర్ణిస్తూ.. నీటిని రాజకీయ లబ్ధి కోసం ఎన్నడూ ఆయుధంగా ఉపయోగించకూడదని నీతులు వల్లించారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ వేదికగా జరుగుతోన్న సదస్సులో మంగళవారం (సెప్టెంబర్ 1) SCO దేశాధినేతల మండలిని ఉద్దేశించి షరీఫ్ ప్రసంగిస్తూ సింధు నది జలాల వివాదాన్ని లెవనేత్తారు.
సింధూ జలాలు పాకిస్తాన్‌కు జీవనాధారంగా ఆయన అభివర్ణించారు. సింధూ జలాలు లక్షలాది మంది జీవితాలను నిలబెడుతుందని.. వ్యవసాయానికి తోడ్పడుతుందని తెలిపారు. రాబోయే తరాల భవిష్యత్తుకు సింధూ నది జలాల ఒప్పందం కీలకమని పేర్కొన్నారు. నీటిని ఆయుధంగా ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని.. భారత్-పాక్ ఉమ్మడి నీటి వనరులను బలవంతపు చర్యలకు లేదా రాజకీయ ప్రయోజనాలకు సాధనంగా మార్చకూడదని ప్రగల్భాలు పలికారు.
ఉమ్మడి జలాలను నియంత్రించే ఒప్పందాలు గంభీరమైన, కట్టుబడి ఉండాల్సిన అంతర్జాతీయ కట్టుబాట్లని పేర్కొన్నారు. మీ ఇష్టానుసారం పక్కన పెట్టడానికి అవి రాజకీయ సౌలభ్యాలకు సంబంధించిన విషయాలు కావని ఇండియాకు కౌంటర్ ఇచ్చారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని అక్షర రూపంలోనూ, స్ఫూర్తి రూపంలోనూ బేషరతుగా గౌరవించాలని నీతులు వల్లించారు.
►ALSO READ | టైమ్స్ స్క్వేర్ కాల్పులు.. కత్తితో దాడి చేసిన మహిళను కాల్చి చంపిన న్యూయార్క్ పోలీసులు!
2025, ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి భారత్‌కు సరైన కారణాలు లేవని, ఈ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. జమ్మూకశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కొన్ని అంశాలపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది.
హేగ్ కోర్టు తీర్పుపై ఇండియా ఫైర్:
సింధూ జలాల ఒప్పందంపై హేగ్ కోర్టు తీర్పును భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ సంస్థ ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. సింధూ జలాలను పంపిణీ నిలిపివేసే ఒప్పందం అమలులో ఉందని ఇండియా తేల్చి చెప్పింది. ఒప్పందంలోని నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ప్రపంచ బ్యాంకు ఈ సోకాల్డ్ కోర్టును ఏర్పాటు చేసిందని, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ గతంలో వెలువరించిన అన్ని ప్రకటనలను భారతదేశం ఎలాగైతే గట్టిగా తిరస్కరించిందో, అలాగే ఈ కోర్టు ఇచ్చిన ఈ సోకాల్డ్ అవార్డును కూడా తిరస్కరిస్తోందని ఇండియా స్పష్టం చేసింది.
