200 ఏళ్ల నాటి కోటను 400 కోట్లకు కొన్న జుకర్‌బర్గ్: కిచెన్ నుంచి డైనింగ్ ఏరియాకు వెళ్లాలంటే 5 నిమిషాలు

200 ఏళ్ల నాటి కోటను 400 కోట్లకు కొన్న జుకర్‌బర్గ్: కిచెన్ నుంచి డైనింగ్ ఏరియాకు వెళ్లాలంటే 5 నిమిషాలు

హీరో వెంకటేష్ సినిమా మల్లీశ్వరి ఉంది కదా.. అందులో ఒక సీన్.. తన బెడ్ రూమ్ నుంచి డైనింగ్ హాల్ కు వెళ్లటానికి నడుస్తూనే ఉంటారు.. తినటానికి వెళుతున్నట్లు లేదు.. తిన్నది అరగటానికి వెళుతున్నట్లు ఉంది అనే డైలాగ్ ఉంటుంది.. అంత పెద్దది ఆ కోట అని చెప్పటానికి.. సేమ్ టూ సేమ్.. అచ్చం అలాంటి అతి పెద్ద పురాతన కోటను కొనుగోలు చేశారు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రా అధినేత మార్క్ జుకర్ బర్గ్. ఆ కోట 200 ఏళ్ల నాటిది.. దీన్ని ఇప్పుడు 400 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్ అయ్యారు మార్క్ జుకర్ బర్గ్.. ఆ కోట విశేషాలు తెలుసుకుందామా..

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఐర్లాండ్‌లో సుమారు 440 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక ప్రాపర్టీని కొనేగోలు చేశారు. ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్ కౌంటీలో ఉన్న ప్రసిద్ధ  స్ట్రాన్‌కల్లీ క్యాజిల్ ఎస్టేట్‌ను ఈ దంపతులు సొంతం చేసుకున్నారు. డీల్ ఎంతకు జరిగిందనే వివరాలు బయటకు రానప్పటికీ దీని విలువ సుమారు 20 మిలియన్ యూరోల నుంచి 30 మిలియన్ యూరోల మధ్య ఉంటుందని సమాచారం.

ఐర్లాండ్‌లో మెటా సంస్థ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ దేశానికి తరచూ వస్తుండే జుకర్‌బర్గ్ ఫ్యామిలీ, తమ పర్యటనల సమయంలో బస చేయడానికి ఈ విలాసవంతమైన కోటను ఉపయోగించనుంది. చారిత్రాత్మకమైన ఈ భవనాన్ని సంరక్షించేందుకు, ఐర్లాండ్‌లో సమయం గడపడానికి మార్క్ కుటుంబం ఎంతో ఆసక్తిగా ఉంది.

ఈ స్ట్రాన్‌కల్లీ క్యాజిల్ ఎస్టేట్ సుమారు440 ఎకరాల విస్తీర్ణంలో బ్లాక్‌వాటర్ వ్యాలీలో ఉంది. దీనిని 1830లో మాజీ పార్లమెంట్ సభ్యుడు జాన్ కీలీ కోసం ప్రముఖ ఆర్కిటెక్టులు జేమ్స్, జార్జ్ రిచర్డ్ పెయిన్ రూపొందించారు. ఈ భవనం ఎంత విశాలమైనదో చెప్పడానికి 'ది హౌసెస్ ఆఫ్ ఐర్లాండ్' పుస్తకంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. డైనింగ్ రూమ్ నుంచి కిచెన్‌కు నడిచి వెళ్లడానికి ఏకంగా నాలుగున్నర నిమిషాలు పడుతుందట.

ALSO READ ; 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 70వేలు దాటే అవకాశం

గతంలో ఈ కోటను లండన్‌కు చెందిన RAB క్యాపిటల్ కో-ఫౌండర్ మైఖేల్ అలెన్-బక్లీ, ఆయన భార్య గియాన్‌కార్లా కొనుగోలు చేసి సుమారు 25 ఏళ్ల పాటు సంరక్షించారు. గత 2 దశాబ్దాలుగా దీనిని ఎంతో అద్భుతంగా పునరుద్ధరించిన వారు.. జుకర్‌బర్గ్ లాంటి ప్రముఖ వ్యక్తి 200 ఏళ్ల నాటి ఈ హిస్టారిక్ ప్రాపర్టీని కొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఈ కోటను.. దాని పరిసరాలను అదే రీతిలో సంరషిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఈ కోటను సొంతం చేసుకోవడం ద్వారా ఐర్లాండ్‌తో తనకున్న అనుబంధాన్ని మరింత బలపరుచుకున్నారు.