1000 రోజుల ప్రజాపాలన.. మహిళలకు ఫ్రీ జర్నీ నుంచి  ఈవీ బస్సుల దాకా.. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

1000 రోజుల ప్రజాపాలన.. మహిళలకు ఫ్రీ జర్నీ నుంచి  ఈవీ బస్సుల దాకా.. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ టీజీఎస్ఆర్టీసీ  దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా... రవాణా శాఖ,ఆర్టీసీ రంగంలో విప్లవాత్మక మార్పులు,సాధించిన విజయాలను పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ప్రభుత్వం కొలువుదీరిన కేవలం 48 గంటల్లోనే మహిళల కోసం అద్భుతమైన మహా లక్ష్మి పథకాన్ని ప్రారంభించాం. ఇప్పటివరకు 347 కోట్ల 36 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి, దాదాపు రూ. 12,167 కోట్లు ఆదా చేసుకున్నారు. అంతేకాదు, దేశంలోనే మొదటిసారిగా 600 బస్సులకు మహిళలనే యజమానులను చేసి, వారి ఆర్థిక వృద్ధికి బాటలు వేసింది మన ప్రభుత్వం.

ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశాం. ఇప్పటికే 1,024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తుండగా... త్వరలోనే హైదరాబాద్ నగరంలో మరో 2,200 కొత్త ఈవీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. గతంలో 67 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో, నేడు 89 శాతానికి పెరిగింది.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే మా ధ్యేయం. సర్వీసు నుంచి తొలగించబడిన 244 మంది ఉద్యోగులను ప్రత్యేక కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకున్నాం. కారుణ్య నియామకాల కింద 1,424 ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే 4,538 ఉద్యోగాల నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది.టీఎస్  నుంచి టీజీ గా మార్పులు చేసుకుంటూ... వాహన్ & సారథి విధానాన్ని తెచ్చాం. రవాణా శాఖలో అవినీతికి తావులేకుండా చెక్‌పోస్టులను ఎత్తివేసి, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను బలోపేతం చేశాం.

 సీఎం రేవంత్  నాయకత్వంలో, డిప్యూటీ సీఎం,ప్రజా ప్రతినిధుల సహకారంతో... గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు మెరుగైన రవాణా సేవలను అందిస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల భద్రత  మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు పొన్నం.