మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతమంటే ఊరుకోం: రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతమంటే ఊరుకోం: రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదే.. కానీ మా ఇంట్లోకి, పార్టీలోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతాం అంటే మాత్రం ఊరుకోమని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీని ఎవడూ కబ్జా చేయలేడని.. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వాళ్ల తరపున రాజగోపాల్ రెడ్డి పోరాడుతాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయకుంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తా.. కానీ మాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. 

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి తన సొంత గ్రామం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి.. పేద ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలనే స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.

►ALSO READ | రాజీనామా చేయమని ఇప్పటి వరకు చెప్పలేదు: ఖర్గేతో భేటీ తర్వాత మంత్రి సురేఖ

కార్పొరేట్ హాస్పిటల్‌లో ఈ రోజు పేదవారు ట్రీట్‌మెంట్ తీసుకున్నారంటే అది ఆయన పుణ్యమేనని అన్నారు. పేద ప్రజల కోసం, రైతుల కోసం వైఎస్ తీసుకొచ్చిన పథకాలు దేశ చరిత్రలో ఏ నాయకుడు తీసుకురాలేదని చెప్పారు. తెలంగాణలో వైఎస్ అభిమానులు ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఉన్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ ప్రాంత కరువు, ఫ్లోరైడ్‌ను నిర్మూలించడానికి ఉదయసముద్రం ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు. 

10 సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పని చేస్తామని.. మాట ఇస్తే మడమ తిప్పమని ఆయన ఎలా ఉన్నాడో, మేము కూడా అలానే ఇప్పటికీ ఉన్నామని పేర్కొన్నారు. రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమేనని చెప్పారు.