- చోరీకి గురైన వెహికల్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేలా కొత్త సిస్టం అమలు
- గ్రేటర్ సిటీలోని 13 జంక్షన్ లలో ఏర్పాటు
- చైన్ స్నాచర్లు, వివిధ కేసుల్లో దుండగులను గుర్తించేలా చర్యలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో దిగుతున్న దుండగులు అక్కడ పార్క్ చేసిన బైక్‌లు చోరీ చేసి, వాటిపైనే తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చోరీకి గురైన వాహనాలను వెంటనే గుర్తించి, వాటి కదలికలను ట్రాక్ చేసేందుకు గ్రేటర్ సిటీలో ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు.
దొంగ బండ్లకు చెక్..
ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే వారధిగా నిలుస్తున్న వరంగల్ నగరానికి రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా మెరుగైన కనెక్టివిటీ ఉంది. దీంతో ఉపాధి, ఇతర అవసరాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చిపోతుంటారు. ఇదే కనెక్టివిటీని కొందరు నేరగాళ్లు కూడా అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లు, హనుమకొండ, వరంగల్ బస్టాండ్ల వద్ద పార్క్ చేసి ఉన్న టూ వీలర్స్ చోరీ చేసి, వాటిపైనే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవల నగరంలో నమోదైన పలు చైన్ స్నాచింగ్ కేసులు దాదాపు ఇలాగే జరిగాయి.
గతంలో చోరీకి గురైన వాహనం ఎటువైపు వెళ్లిందో గుర్తించడం పోలీసులకు సవాల్‌గా ఉండేది. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన ఏఎన్‌పీఆర్ కెమెరాలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. చోరీకి గురైన వాహనం నెంబర్‌ను కెమెరా నెట్‌వర్క్ ద్వారా ట్రాక్ చేస్తూ అది ఏ మార్గంలో వెళ్లిందో ఈజీగా కనిపెడుతున్నారు. ఈ విధానంతో ఇటీవల వేర్వేరు కేసుల్లో చోరీకి గురైన 8 టూ వీలర్స్‌ను పోలీసులు గుర్తించి, నిందితులను కూడా అరెస్ట్ చేశారు.
రూల్స్ తప్పితే.. ఫైన్ తప్పదు
గ్రేటర్ వరంగల్ కు నిత్యం భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల కేంద్రాలు కావడంతో ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలకు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో వెహికల్స్వస్తుంటాయి. పోలీసుల అంచనా ప్రకారం వరంగల్ ట్రైసిటీలో ప్రతిరోజూ ఐదు లక్షలకుపైగా వెహికల్స్తిరుగుతున్నాయి. వీటిలో కొందరు వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, సిగ్నల్ జంప్ చేయడం, అతివేగంగా ప్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
చాలాన్ల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లు తొలగించడం, నెంబర్ కనిపించకుండా ట్యాంపరింగ్ చేయడం వంటి చర్యలకు కూడా కొందరు పాల్పడుతున్నారు. ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించడంలోనూ ఏఎన్‌పీఆర్ కెమెరాలు కీలకంగా మారాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను కెమెరాలు గుర్తించి, వాటి ఆధారంగా ఫైన్లు విధించే అవకాశం ఉంది. గతంలో మాన్యువల్‌గా ఫైన్లు విధించే సమయంలో వాహనదారులు, ట్రాఫిక్ సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరిగేవి. ఏఎన్‌పీఆర్ ఆధారిత చలాన్లతో ఈ సమస్యలు తగ్గుతాయని పోలీసులు చెబుతున్నారు.
మెయిన్ జంక్షన్లలో పకడ్బందీ నిఘా..
నగరంలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని కవర్ చేసేలా ప్రధాన సెంటర్లు, జంక్షన్లలో 750కిపైగా సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. వీటిలో 149 ఏఎన్‌పీఆర్ కెమెరాలు ఉన్నాయి. మడికొండ, కాజీపేట, సుబేదారి, అదాలత్, సీపీవో జంక్షన్, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అశోక జంక్షన్, ములుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మమైదాన్ తదితర కీలక ప్రాంతాలైన 13 జంక్షన్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లింక్అప్ చేశారు. వీటి ద్వారా వెహికల్స్‌పై నిఘా పెంచారు. వీటికి అదనంగా 35 రెడ్ సిగ్నల్ వయొలేషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ రూల్స్వయొలేషన్స్కు ఫైన్లు కూడా విధించే అవకాశం ఉంటుందని పోలీస్ ఆఫీసర్లు తెలిపారు.
రోడ్లెక్కితే కెమెరాలో స్కాన్ అయినట్టే..
వరంగల్ నగర పరిధిలో థెఫ్ట్ అయిన వెహికల్ ఎటువైపు వెళ్లిందో ఈజీగా కనిపెట్టేందుకు ఏఎన్ పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా థెఫ్ట్ అయిన వెహికల్స్ ను గుర్తిస్తున్నాం. అలాగే చిన్నచిన్న కారణాలకు కాకుండా మేజర్ ట్రాఫిక్ వయొలేషన్స్ కు కూడా ఫైన్లు విధిస్తున్నాం. వరంగల్ రోడ్లపైకి వచ్చి నన్నెవరూ చూడటం లేదనుకుంటే పొరపాటే. రోడ్డు ఎక్కిన ప్రతి బండి ఏఎన్ పీఆర్ కెమెరాల్లో స్కాన్ అయినట్టే. నేరస్తులను గుర్తించడంలోనూ ఈ కెమెరాలు ఉపయోగపడతాయి
.-ట్రాఫిక్ ఏసీపీ, వరంగల్
